సుంకర వర్సెస్ షర్మిల.. కాంగ్రెస్‌లో కత్తులు..!
ఏపీ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి, కలయిక, సీనియర్లు-జూనియర్ల మధ్య సఖ్యత ఎలా ఉన్నా.. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకునే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 11 Jun 2025 11:16 AM ISTఏపీ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి, కలయిక, సీనియర్లు-జూనియర్ల మధ్య సఖ్యత ఎలా ఉన్నా.. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకునే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆది నుంచి కూడా కొందరు నాయకులు.. పార్టీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిలను విభేదిస్తున్నారు. ఆమె నాయకత్వాన్ని తొలినాళ్లలో స్వాగతించిన వారు కూడా.. తర్వాత కాలంలో సొంత అజెండా అమలు చేస్తున్నారని.. టికెట్లను కూడా.. వేరే రూపంలో ఇస్తున్నారని.. గత ఏడాది ఎన్నికలకు ముందు కూడా ఆరోపించారు. అయితే.. తర్వాత కాలంలో ఎన్నికలు పూర్తికావడం.. పార్టి పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడం తెలిసిందే.
అయితే.. పార్టీలో సఖ్యతను పెంచేందుకు ఇటు షర్మిలవైపు నుంచి కానీ.. సర్దు పోయే తరహా రాజకీయాలు చేసేందుకు అటు నాయకుల నుంచి కానీ.. ఎక్కడా అడుగులు పడడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆరు మాసాల కిందటి వరకు ఉన్న రాష్ట్ర పీసీసీ వర్గాన్ని షర్మిల సంపూర్ణంగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి మరీ.. ఆమె స్థానిక నాయకత్వాన్ని మార్చుకున్నారు. దీంతో ఈ పరిణామం సీనియర్లను మరింత కోపోద్రిక్తులను చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు సుంకర పద్మశ్రీని ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించారు. కొన్నాళ్లు సస్పెండ్ కూడా చేయించారు.
అయితే.. ఆ తర్వాత పద్మశ్రీ పార్టీ అధిష్టానాన్ని కలుసుకుని.. తిరిగి పదవి తెచ్చుకున్నారు. అయినప్పటికీ.. పార్టీ చీఫ్ షర్మిల కు, పద్మశ్రీకి మధ్య వివాదం మాత్రం తారస్థాయిలో కొనసాగుతోంది. ఎక్కడికక్కడ సుంకర పద్మశ్రీ షర్మిలను విభేదిస్తున్నారు. తాజాగా అనంతపురం, కడపలలో పర్యటించిన పద్మశ్రీ.. షర్మిలకు వ్యతిరేకంగా గ్రూపును కూడగట్టే ప్రయత్నం చేశారు. షర్మిలకు వ్యతిరేకంగా సొంత జిల్లాలోనే ఆమె ఈ చర్యలకు దిగడంతో షర్మిల కూడా ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో హుటాహుటిన అనంతపురానికి చేరుకున్న ఆమె.. పద్మశ్రీకి అనుకూలంగా ఉన్న నాయకులపై నిప్పులు చెరిగారు. పార్టీలో గ్రూపులను సహించేది లేదన్నారు.
మరోవైపు.. పద్మశ్రీ పేరును నేరుగా ఎత్తకుండానే.. తనపై కుట్రలు చేస్తున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిని ఉపే క్షించేది కూడా లేదని తెగేసి చెప్పారు. అయితే.. పద్మశ్రీ వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు.. షర్మిలకు దూరంగా ఉండడం గమనార్హం. ఇప్పుడు వీరి జాబితాను తనకు ఇవ్వాలంటూ అనంత నాయకులను షర్మిల ఆదేశించారు. మరోవైపు.. విజయ వాడలోనూ ఇటీవల షర్మిల కార్యక్రమాలకు సీనియర్లు ఎవరూ రాలేదు. దీనికి కూడా పద్మశ్రీనే కారణమని షర్మిల భావిస్తున్నా రు. ఈ పరిణామాల నేపథ్యంలో తనను వ్యతిరేకించే వారి జాబితాను ఇవ్వాలంటూ.. షర్మిల ఆదేశించడం.. మరోవైపు పద్మశ్రీ నేరుగా షర్మిలతో ఢీ కొట్టేందుకు ప్రయత్నించడం వంటివి రాజకీయంగా కాంగ్రెస్‌లో మరింత రచ్చగా మారింది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
