కవిత షర్మిలకు గోల్డెన్ చాన్స్ !
రాజకీయాల్లో అవకాశాలు రావాలి. కాలం కలిసొస్తే మంత్రి పదవి కూడా చేపట్టకుండా కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండా ముఖ్యమంత్రి అయిపోవచ్చు.
By: Satya P | 3 April 2026 8:18 AM ISTరాజకీయాల్లో అవకాశాలు రావాలి. కాలం కలిసొస్తే మంత్రి పదవి కూడా చేపట్టకుండా కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండా ముఖ్యమంత్రి అయిపోవచ్చు. ఎంపీ కాకుండానే ప్రధాని పదవిలో కూర్చోవచ్చు. ఇవన్నీ ఈ దేశంలో జరిగాయి. ఇక తెలుగు రాజకీయాల్లో చూస్తే ఇప్పటిదాకా పురుషాధిపత్యం సాగుతోంది. మహిళా రాజకీయ నాయకురాళ్ళు ఉన్నారు కానీ వారు ద్వితీయ స్థానాలకే పరిమితం అవుతున్నారు. ఈ నేపధ్యంలో రెండు ప్రముఖ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వైఎస్ షర్మిల, కల్వకుంట్ల కవిత ఇద్దరూ తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
వైసీపీకి షర్మిల షాక్:
ఈ ఇద్దరూ సొంత కుటుంబాలను వ్యతిరేకిస్తూ సొంత రాజకీయం చేస్తున్నారు. ఇందులో షర్మిల అయితే తెలంగాణాలో వైఎస్సార్ టీపీని స్థాపించి కొన్నాళ్ళు అక్కడ రాజకీయం చేశారు. చివరికి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి 2024 ఎన్నికల ముందు ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆమె తానుగా గెలవకపోయినా వైసీపీని ఓడించారు. దాంతో పాటు వైసీపీకి రాయలసీమలో పెద్ద దెబ్బ తగిలి ఏకంగా విపక్ష స్థానానికి సైతం సరిపడా సీట్లు దక్కకుండా 11 సీట్లకే పరిమితమై చతికిలపడింది. ఇక ఏపీ కాంగ్రెస్ కి ఆమె ప్రెసిడెంట్ గా తనదైన శైలిలో పనిచేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ దే కావడం దాని అధినేత జగన్ కావడంతో వైఎస్సార్ వారసురాలిగా షర్మిలను పీసీసీ పీఠం మీద ఉంచితే ఎంతో కొంత కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ దక్కుతుందన్న ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు జాతీయ స్థాయిలో ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
భారీగా బూస్టింగ్ :
ఈ క్రమంలో ఏపీలో అదనంగా మరో యాభై శాతం సీట్లు పెరుగుతాయని అంటున్నారు. అంతే కాదు మొత్తం సీట్లలో మూడవ వంతు మహిళలకు రిజర్వేషన్ అంటున్నారు. అంటే ఏపీలో 263 సీట్లు పెరిగితే అందులో 88 సీట్ల దాకా విమెన్ రిజర్వేషన్ కిందకు వస్తుంది. ఈ సీట్లలో పోటీ చేయడానికి మహిళా నాయకురాళ్ళు రెడీగా ఉండాల్సిందే. ఇప్పటికే కీలకమైన స్థానాల్లో ఉన్న వారికి ఈ సీట్ల పెరుగుదల రిజర్వేషన్లు అన్నవి అతి పెద్ద బూస్టింగ్ గా అని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కడప జిల్లాలో పది సీట్లు పదిహేను అవుతాయని అంటున్నారు.
అందులో అయిదు సీట్లు మహిళలకు దక్కుతాయి. కడప అంటే వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట. 2024 లో కడప ఎంపీ సీటుకు షర్మిల పోటీ చేశారు. లక్షన్నర ఓట్లు తెచ్చుకున్నారు. ఇపుడు పెద్ద నియోజకవర్గాలు చిన్నవిగా మారితే మహిళా రిజర్వేషన్లు అయితే షర్మిలకు కుటుంబ నేపథ్యం, రాజకీయంగా పరిస్థితులు అనుకూలించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆమె మీద బలమైన అభ్యర్థులను ప్రత్యర్ధులు వెతకాల్సి ఉంటుంది. లేకపోతే స్టేట్ వైడ్ లీడర్ గా ఉన్న షర్మిల జాగ్రత్తగా చేసుకుంటే గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం కష్టం కాబోదు అని అంటున్నారు.
కవితకు కలిసి వస్తుందా :
కవిత తెలంగాణాలో కొత్త పార్టీని స్థాపించబోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కొత్తగా సీట్లు పెరగడం చిన్న అసెంబ్లీ నియోజకవర్గాలుగా మారడం కలిసి వచ్చే అంశమే అంటున్నారు. అక్కడ కూడా 59 దాకా సీట్లు మహిళా రిజర్వేషన్ల రూపంలో దక్కనున్నాయి. కవిత జనంలో ఉంటున్నారు తండ్రి కేసీఆర్ మాదిరిగానే ఫైర్ బ్రాండ్ గా ఉంటున్నారు. దాంతో ఆమె తనతో పాటు కొందరు మహిళా నేతలను కనుక జాగ్రత్తాగ ఎంపిక చేసుకుంటే రిజర్వ్డ్ సీట్లలో గెలుచుకోగలరని అంటున్నారు.
అలాగే ఇమేజ్ ఉన్న నాయకులు ఆమె పార్టీలో చేరితే చతుర్ముఖ పోరులో చిన్న నియోజకవర్గాల్లో ఓట్లు అటు నుంచి ఇటు అయితే గెలిచే వీలు ఉంటుందని లెక్క వేస్తున్నారు. మొత్తానికి కవిత పార్టీకి ఇది శుభారంభం అని అంటున్నారు. ఏది ఏమైనా మహిళా రాజకీయ నాయకురాళ్ళుగా పట్టుదలగా పోరాడుతున్న కవిత షర్మిల రాజకీయ జాతకాన్ని మార్చే విధంగా పునర్ విభజన కానీ మహిళా రిజర్వేషన్ కానీ ఉండబోతున్నాయా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు.
