ఓటు బ్యాంకు పెంచుదాం.. ఏపీ కాంగ్రెస్ అంతర్మథనం!
రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించడం అంటే.. తమను తాము పెద్దలను చేసుకోవడమే.
By: Tupaki Desk | 5 July 2025 3:00 AM ISTరాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించడం అంటే.. తమను తాము పెద్దలను చేసుకోవడమే. తద్వారా ప్రజల ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా తిప్పుకోవడమే. ఈ విషయంలో తేడా లేదు. ఏనాయకుడు అయినా.. ఏ పార్టీ అయినా.. చేసేది ఇదే. వైసీపీ టీడీపీని విమర్శించినా.. టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి .. హెచ్చరికలు, వార్నింగులు ఇచ్చినా.. అంతిమంగా ఓటు బ్యాంకు చుట్టూనే రాజకీయాలు తిరుగుతు ఉంటాయి. దీనిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు.
ఈ పరంగా చూసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ చీఫ్.. షర్మిల చేస్తున్న రాజకీయాలు కూడా ఇదే మోస్తరుగా ఉంటున్నాయి. జగన్ యాత్రలకు అనుమతులు ఇవ్వరాదని.. ఆయనను బయటకు రాకుండా కూటమి ప్రభు త్వం కట్టడి చేయాలని షర్మిల కోరుకుంటున్నారు. అయితే.. అలా చేస్తారా? చేసేందుకు అవకాశం ఉందా? అనేది ప్రశ్న. దీనిని పక్కన పెడితే.. ఒకవేళ జగన్ యాత్రలకు నిషేధం విధిస్తే.. తద్వారా జరిగే లబ్ధి ఎవరి ఖాతాలోకి చేరుతుందన్నది ప్రశ్న.
జగన్‌ను అడ్డుకోవడం ద్వారా షర్మిలకు ఓట్లు పడతాయా? జగన్ ఓటు బ్యాంకు, సీట్లు కూడా షర్మిలకు అనుకూలంగా మారి.. కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తాయా? అనేది ప్రశ్న. ఈ విషయాన్ని గత ఎన్నికలే స్పష్టం చేశాయి. కాలికి బలపం కట్టుకుని ఎన్నికలకుముందు పది పదిహేను రోజుల పాటు కడపలోనే తిష్ట చేసి ప్రచారం చేశారు షర్మిల. వివేకా హత్య కేసు నుంచి తమ ఆస్తుల వివాదం వరకు కూడా అనేక ప్రయోగాలు చేశారు. కానీ, ప్రజలు ఆమెను గెలిపించలేదు. కనీసం డిపాజిట్లు కూడా రాలేదని అంటారు.
ఇలా చూసుకున్నప్పుడు.. ఇప్పుడు జగన్‌ను నిలువరిచండం ద్వారా.. తనకు మేలు జరుగుతుందని షర్మిల అనుకుంటే పొరపాటేనన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. వ్యక్తిగతంగా ప్రజలకుచేరువ కావడం, వారి సమస్యలపై స్పందించడం.. ప్రజల పక్షాన ఉండడం ద్వారా మాత్రమే ప్రజలను తమకు అనుకూలంగా తిప్పుకొనేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. అలా కాకుండా.. కేవలం ఒక నాయకుడిని నిగ్రహించినంత మాత్రాన, నిషేధం విధించినంత మాత్రాన తమకు మేలు జరుగుతుందని అనుకుంటే.. షర్మిలకు ప్రయోజనం తక్కువేనని చెబుతున్నారు.
