Begin typing your search above and press return to search.

దీక్షాదక్షురాలు షర్మిల...వైసీపీని దాటిన కాంగ్రెస్

ఏపీలో విపక్ష పాత్రలో తానూ ఉన్నాను అని పీసీసీ చీఫ్ షర్మిల అంటున్నారు. అనడమే కాదు ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగిపోయారు.

By:  Tupaki Desk   |   21 May 2025 11:12 PM IST
దీక్షాదక్షురాలు షర్మిల...వైసీపీని దాటిన కాంగ్రెస్
X

ఏపీలో విపక్ష పాత్రలో తానూ ఉన్నాను అని పీసీసీ చీఫ్ షర్మిల అంటున్నారు. అనడమే కాదు ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగిపోయారు. విశాఖ ఉక్కు కార్మికుల శిబిరంలో ఆమె చేరి అమరణ నిరాహార దీక్షను చేపట్టారు. ఆమె బుధవారం విశాఖ స్టీల్ ప్లాంట్ శిబిరానికి వచ్చి తాను అమరణ దీక్షను చేపడుతున్నట్లుగా ప్రకటించారు.

విశాఖ ఉక్కులో తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమె దీక్షకు సిద్ధపడ్డారు. ఈ మధ్యకాలంలో వరసబెట్టి తొలగించిన రెండు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణం విధులలోకి తీసుకోవాల్సిందే అని ఆమె ఉక్కు యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేశారు.

ఈ విషయంలో ఉక్కు యాజమాన్యం తగిన చర్యలు చేపట్టకపొతే తాను ప్రాణ త్యాగం చేస్తాను అని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి చేరుకున్న షర్మిల దీక్షా శిబిరం వద్దనే తన అమరణ దీక్ష నిర్ణయాన్ని ప్రకటించి ఉక్కు యాజమాన్యానికి షాక్ ఇచ్చారు.

ఇదే అంశం మీద ఈ నెల 20న ఉక్కు కార్మికులు భారీ సమ్మె చేశారు. ఇంకా కొనసాగిస్తున్నారు దాంతో వారికి మద్దతుగా షర్మిల రంగంలోకి దిగారు. విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ శాశ్వత కార్మికుల సమస్యలను కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ దృష్టిలో ఉంచి అవి పరిష్కారం అయ్యేలా చూస్తాను అని ఆమె అన్నారు. జాతీయ స్థాయిలో విశాఖ ఉక్కు సమస్యను అతి పెద్ద అంశంగా మారుస్తామని కేంద్రం దిగి వచ్చేలా చేస్తామని ప్రకటించారు.

ఇదిలా ఉంటే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయవద్దు అని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసమే బంగారం లాంటి ఉక్కుని చంపేస్తున్నారు అన్నారు. మరో వైపు చూస్తే ఈ నెల 6న ఆమె విశాఖ ఉక్కు కార్మిక శిబిరాన్ని సందర్శించి ఒక రోజు దీక్ష చేపట్టారు. ఇపుడు ఏకంగా అమరణ దీక్ష చేయడంతో భారీగా పోలీసులను దీక్షా శిబిరం వద్ద మోహరించారు. దాంతో షర్మిల దీక్ష మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతాయన్నది చర్చగా ఉంది.

మరో వైపు చూస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం మీద వైసీపీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉక్కు కార్మిక సంఘాల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. తాజాగా జగన్ తో విశాఖ జిల్లా వైసీపీ నాయకులు భేటీ అయినపుడు ఉక్కు అంశం చర్చకు వచ్చింది ప్రత్యకష ఆందోళన చేయడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. వైసీపీ ఇంకా సర్దుకోకముందే షర్మిల నేరుగా అమరణ దీక్ష చేస్తూ కాంగ్రెస్ రేసులో ఉందనిపించారు. మరి వైసీపీ ఉక్కు పోరాటంలో వెనకబడింది అన్న చర్చ వస్తోంది. చూడాలి మరి వైసీపీ ఏ విధంగా ప్రత్యక్ష పోరాటం చేస్తుందో.