''ఆమె మా వైఎస్ కుమార్తె కాబట్టి సర్దుకుపోతున్నాం''
కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల.. ఏపీ పగ్గాలు చేపడుతూనే.. ఘర్ వాపసీ మంత్రం జపించారు.
By: Tupaki Desk | 9 May 2025 12:30 AMకాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల.. ఏపీ పగ్గాలు చేపడుతూనే.. ఘర్ వాపసీ మంత్రం జపించారు. అంటే.. వైసీపీలోకి వెళ్లిపోయిన కాంగ్రెస్ పాతతరం నాయకులు, యువకులను ఆకర్షించాలని ఆమె భావించారు. ఇదే విషయాన్ని కూడా చెప్పారు. అయితే.. ఆ తర్వాత ఎన్నికలు వచ్చిన క్రమంలో షర్మిలపై విశ్వాసం తోనో.. వైఎస్‌పై అభిమానంతోనో కొందరు నాయకులు తిరిగి వచ్చారు. వీరిలో ఆమంచి కృష్ణమోహన్, కిల్లి కృపారాణి సహా పలువురు ఉన్నారు.
ఇక, ఎన్నికల్లో పెరఫార్మెన్స్ దారుణంగా ఉండడం.. తర్వాత కూడా తనను తాను పరిశీలించుకునే ప్రయత్నం చేయకపోవడంతో షర్మిల.. ఘర్ వాపసీ వికటించింది. వచ్చిన వారు కూడా సైలెంట్ అయ్యారు. ఇక, సాకే శైలజానాథ్ సహా.. మరికొందరు దూరమయ్యారు. కట్ చేస్తే.. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే.. టీ-బిస్కట్ బ్యాచ్ మాత్రమే షర్మిల వెనుక నిలబడుతున్నారు. కీలకమైన పళ్లం రాజు, జేడీ శీలం వంటి నాయకులు కనిపించడం లేదు.
మరోవైపు.. బయటకు వచ్చేందుకు మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఎందుకు చర్చకు వస్తోందంటే.. కూటమిలో లుకలుకలు ఏర్పడుతున్న మాట వాస్తవమే. కానీ, ఒక్కరూ బయటకు రావ డం లేదు. వచ్చినా.. షర్మిలవైపు చూడడం లేదు. ఎవరికి వారుగా ఉంటున్నారు. దీంతో అసలు ఘర్ వాపసీ మంత్రం ఏమైందన్న ప్రశ్న తలెత్తింది. పైగా.. షర్మిల ఇమేజ్ కూడా పెద్దగా కనిపించడం లేదు. నాయకురాలికే ఇమేజ్ లేనప్పుడు ఇతర నాయకుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్న.
కేంద్రంలోని ఏఐసీసీ త్వరలోనే డీసీసీలలో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నాయకులు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ఇటీవల విజయవాడకు వచ్చి.. అమరావతిపై రచ్చ చేసిన సమయంలో షర్మిల సీనియర్ నాయకులు ఏరీ? అంటూ ప్రశ్నించారు. దీంతో ఒకరిద్దరిని పోలీసులు నిర్బంధించారని చెప్పారు. కానీ, వాస్తవం ఏంటంటే.. సదరు నాయకులు అసలు గడపే దాటి బయటకు రాలేదు. నిలకడలేని నడక సాగిస్తున్న షర్మిలతో విసుగువస్తోందని అంతర్గత సమావేశాల్లో కుండబద్దలు కొడుతున్నారు. ``ఆమె మా వైఎస్ కుమార్తె కాబట్టి సర్దుకు పోతున్నాం`` అనే మాట వినిపిస్తోంది.