వైసీపీకి శాపంగా ఓట్ల చీలిక.. ఏం చేయాలి ..!
ప్రధానంగా కాంగ్రెస్ తరఫున షర్మిల రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
By: Garuda Media | 30 April 2026 4:00 AM ISTవచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలంటే కేవలం ప్రభుత్వం మీద పోరాటం చేస్తేనో.. లేక గతంలో తాము ఇచ్చిన సంక్షేమాన్ని మళ్లీ ఇస్తామని చెబుతేనో.. వర్కౌట్ అయ్యే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఓట్ల చీలిక అంశం వైసిపిని తీవ్రంగా వేధిస్తోంది. గత ఎన్నికలను పరిశీలిస్తే ఓట్ల చీలిక భారీ స్థాయిలో కనిపించింది. ప్రధానంగా కాంగ్రెస్ తరఫున షర్మిల రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఒకవైపు కాంగ్రెస్ సానుభూతిపరులను, మరోవైపు వైయస్ రాజశేఖర్ రెడ్డి సానుభూతిపరులను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో కీలక ముందడుగు వేశారు. అయితే ఇది ఆమెకు ఫలించిందా లేదా అనేది పక్కన పెడితే వైసీపీకి మాత్రం పూర్తిస్థాయిలో ఇది డ్యామేజీ చేసిందని పరిశీలకులు చెబుతున్నారు. గత 2024 ఎన్నికలను తీసుకుంటే చాలా నియోజకవర్గాల్లో 1000, 2000 ఓట్ల తేడాతో వైసిపి నాయకులు ఓడిపోయారు. కొన్ని కొన్ని చోట్ల అయితే వందలలోనే తేడా ఉంది. అంటే ఒక రకంగా ఈ ఓట్లు కనక వైసీపీకి పడి ఉంటే ఫలితం వేరేగా ఉండేది.
ఆయా నియోజకవర్గాల్లో పడిన ఓట్లు.. పోటీ చేసిన అభ్యర్థులను పరిశీలిస్తే 1000 రెండు వేల ఓట్ల తేడాతో టిడిపి నాయకులు గెలిచినప్పటికీ ఈ ఓట్లను కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభ్యర్థులు తెచ్చుకున్నారు. ఉదాహరణకు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో 900... 1000.. 1200 ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. ఇది ఒక రకంగా వైసిపి ఓటు బ్యాంకు నుంచి వచ్చిన ఓట్లే అన్నది విశ్లేషకుల అంచనా. ప్రధానంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ప్రస్తావించడంతోపాటు కాంగ్రెస్ పార్టీ సానుకూలతను పెంచే విషయంలో షర్మిల సక్సెస్ అయ్యారని అంటున్నారు.
అయితే వైసిపికి భారీ ఓటమి రావడానికి ఇది తీవ్రంగా ప్రభావం చూపించిందన్న వాదన కూడా ఉంది. అంటే స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన దాదాపు 70 నుంచి 80 నియోజకవర్గాల్లో వైసిపి ఓటు బ్యాంకు చీలిపోయింది. ఈ ఓట్లు కాంగ్రెస్కు పడ్డాయి. అయితే కాంగ్రెస్కు వచ్చిన మేలు ఏమీ లేదు. కానీ, వైసీపీకి మాత్రం భారీ నష్టాన్ని చేకూర్చటంలో కాంగ్రెస్ దోహదపడింది అన్నది వాస్తవం. ఇది వైసీపీలో ఇప్పటికీ చర్చనీయాంసంగానే ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఏం చేయాలి? వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంకు చీలకుండా ఎలా వ్యవహరించాలి అనే విషయంపై దృష్టి పెట్టాలని ఒకరిద్దరు సీనియర్ నాయకులు ఇటీవల జగన్కు స్వయంగా సూచించారు.
దీనిపై కసరత్తు చేయాలని ఆయన కూడా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అయితే ఎలా ముందుకు వెళ్లాలి ఓటు బ్యాంకు ను ఏ విధంగా కాపాడుకోవాలి అనే విషయంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. అయితే ఒకటి మాత్రం వైసీపీలో బలంగా వినిపిస్తున్న మాట ఏమిటంటే.. జగన్ చేపట్టే పాదయాత్ర తమకు ఆక్సిజన్ అందిస్తుందని అంటున్నారు. ఓటు బ్యాంకు ఈసారి చీలిపోదని షర్మిల ను నమ్మేవారు ఎవరూ లేరని విజయవాడకు చెందిన వైసిపి సీనియర్ నాయకుడు గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కి శిష్యుడుగా పేరుందిన మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు.
అయితే మరోవైపు షర్మిల కూడా బస్సుయాత్ర చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో వైసిపి పెట్టుకున్న ఈ అంచనా నిజమవుతుందా లేదా అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ తక్కువలో తక్కువ ఓట్లు పడినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులు వైసిపి అభ్యర్థులను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు అన్నది వాస్తవం అని పరిశీలకులు చెబుతున్నారు. ఈ ప్రమాదం నుంచి వైసిపి బయట పడాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరి ఏం చేస్తారనేది చూడాలి.
