అన్నకు షర్మిల సెగ మామూలుగా లేదుగా?
ఇలాంటి వేళ తెర మీదకు వచ్చారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టే ర్యాలీలు.. బల ప్రదర్శనల్ని బ్యాన్ చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 26 Jun 2025 10:50 AM ISTఇంటి ఆడబిడ్డ రాజకీయ శత్రువుగా మారితే.. అంతకు మించిన నరకం మరొకటి ఉండదు. అందునా తాను అన్న విడిచిన బాణాన్ని అంటూ దూసుకెళ్లే తత్త్వం ఉండి.. అదే వేగం ఇప్పుడు అన్నను వ్యతిరేక దిశగా దూసుకొస్తే వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు వైసీపీ అధినేత.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
ఏ చిన్న అవకాశం లభించినా.. ర్యాలీలు.. పెద్ద ఎత్తన కార్యక్రమాల్ని నిర్వహించటం ద్వారా తన బలం తగ్గలేదని.. తనకు ప్రజల్లో ఆదరణ ఉందని.. తన క్యాడర్ ఎంత జోష్ గా ఉన్నారన్న విషయాన్ని అందరికి చాటి చెప్పేలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇటీవల పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమం.. ఈ సందర్భంగా జగన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చిన ఒక పెద్ద వయస్కుడ్ని పట్టించుకోకుండా కారును నడపటం.. ఈ క్రమంలో జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద పడి చనిపోవటం తెలిసిందే.
దీనిపై ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ రగడ మొదలైంది. తొలుత సదరు పెద్ద వయస్కుడు పడింది జగన్ వాహనం కింద కాదని.. వేరే వాహనం మీద అని స్థానిక జిల్లా ఎస్పీ అధికారికంగా ప్రకటించటం.. ఆ తర్వాత వెలుగు చూసిప సీసీ ఫుటేజ్ కారణంగా.. సదరు పెద్ద వయస్కుడు జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందనే పడిపోయిన విషయాన్ని గుర్తించారు. అనంతరం జగన్ అండ్ కో మీద కేసులు నమోదు చేయటం.. రీసెంట్ గా జగన్ ప్రయాణించిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవటం తెలిసిందే.
ఇలాంటి వేళ తెర మీదకు వచ్చారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టే ర్యాలీలు.. బల ప్రదర్శనల్ని బ్యాన్ చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల సూచనల్ని పాటించకుండా జగన్ చేస్తున్న తప్పుల్ని ఆమె ఎండగట్టారు. అందుకే.. జగన్ పర్యటనలపై బ్యాన్ విధించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. షర్మిల డిమాండ్ పై కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. జగన్ కు కొత్త కష్టాలు షురూ కావటం ఖాయం. మొత్తంగా జగన్ చేపట్టే ర్యాలీలపై షర్మిల డిమాండ్ పై చంద్రబాబు ప్రబుత్వం ఏమని డిసైడ్ చేస్తుందో చూడాలి.
