Begin typing your search above and press return to search.

షర్మిల ఎడాపెడా విమర్శలు.. అలాంటి మాటలు అవసరామా?

తాజాగా ఏలూరు జిల్లా పర్యటనకు వెళ్లిన షర్మిల ఇటు జగన్ తోపాటు అటు ఏపీ పార్లమెంటు సభ్యులపైనా తీవ్ర విమర్శలు చేశారు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 11:55 AM IST
షర్మిల ఎడాపెడా విమర్శలు.. అలాంటి మాటలు అవసరామా?
X

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. తన సోదరుడు జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించే షర్మిల.. అప్పుడప్పుడు హాటు కామెంట్స్ తో మంట పుట్టిస్తుంటారు. తాజాగా ఏలూరు జిల్లా పర్యటనకు వెళ్లిన షర్మిల ఇటు జగన్ తోపాటు అటు ఏపీ పార్లమెంటు సభ్యులపైనా తీవ్ర విమర్శలు చేశారు. పదునైన విమర్శల దాడి చేయడంలో భాగంగా ఆమె వినియోగిస్తున్న పదాలపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో ప్రభుత్వ చిత్తశుద్దిని ప్రశ్నించిన షర్మిల.. తన తండ్రి కలల ప్రాజెక్టును సోదరుడు జగన్ కూడా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో ఏపీ పార్లమెంటు సభ్యుల్లో ‘ఒక్క మగాడు’ లేడన్న ఆమె వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి నుంచి షర్మిల దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. తన వెంట ఎంత మంది నాయకులు ఉన్నారనే విషయాన్ని పక్కన పెడితే రాజకీయంగా ప్రతి అంశంపైనా స్పష్టంగా మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నారు. ఇదే సమయంలో ఆమె వ్యవహారశైలిపై కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అధికార పక్షాన్ని టార్గెట్ చేయాల్సిన ఆమె మాజీ సీఎం జగన్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా విరుచుకుపడుతుంటారని చెబుతున్నారు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో ఆమె కొంచెం ఆచితూచి మాట్లాడుతుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోందని అంటున్నారు. అయితే విపక్షాన్ని ఖాళీ చేసి ఆ స్థానంలోకి రావాలని అనుకుంటున్న షర్మిల వ్యూహం వల్లే ఆమె ఎక్కువగా జగన్ పార్టీపై దృష్టి పెట్టారని చర్చ ఉంది.

ఈ క్రమంలో షర్మిల కొన్నిసార్లు పదునైన విమర్శలు గుప్పిస్తున్నారు. అలా నిన్న పోలవరం పర్యటనలో షర్మిల చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. పోలవరం ఎత్తు తగ్గించి ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బతీశారని ఆరోపిస్తున్న షర్మిల.. పోలవరం విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే మగాడు ఒక్కడూ లేడు అని వ్యాఖ్యానించారు. అయితే మహిళా నాయకురాలిగా ఉంటూ మగతనం కోసం ఆమె మాట్లాడటం కరెక్టు కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రశ్నించే వారు ఒక్క లేరని అంటే సరిపోయేదానికి మగతనం అనే మాటను వాడటం అవసరమా? అన్న చర్చ జరుగుతోంది. నాయకురాలిగా ఎదగాల్సిన వారు సంయమనంతో మాట్లాడాలని షర్మిల శ్రేయోభిలాషులు హితవు పలుకున్నారు.

ఇక పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి కారణం తన సోదరుడు జగన్మోహనరెడ్డి అంటూ కూడా షర్మిల విరుచుకుపడ్డారు. "పోలవరం పూర్తి చేసి ప్రజలకు నీళ్లు ఇస్తామని వాళ్ళు చెప్పారు. అసెంబ్లీలో కూడా పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. కానీ కాంట్రాక్టర్లను మార్చి రివర్స్ టెండర్లకు వెళ్లడం ద్వారా, వాళ్ళు ప్రాజెక్టును 10 సంవత్సరాలు వెనక్కి నెట్టారు" అంటూ షర్మిల ఆరోపించారు. ఇక ప్రాజెక్టు ఆలస్యానికి జగనే కారణమన్న షర్మిల.. ఆయన పార్టీ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. పిల్ల కాలువలు అన్నీ పెద్ద నదిలో.. ఆ తర్వాత సముద్రంలో కలిసినట్లు వైసీపీ అనే పిల్ల కాలువ ఏదో పార్టీలో విలీనమయ్యే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. "కాంగ్రెస్ ఒక విశాల సముద్రం, దానిలో అనేక చిన్న చిన్న వాగులు (పిల్ల కాలువ) చేరతాయి. వైఎస్సార్‌సీపీ వాటిలో ఒకటి మాత్రమే. త్వరలోనే లేదా తరువాత, అది కూడా కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది" అని అన్నారు.