'ఆల్టర్నేట్' ఛాన్స్ మిస్సవుతున్న షర్మిల.. విషయం ఏంటంటే!
ఈ పరిస్థితిలో ఆల్టర్నేట్ రాజకీయాలు ఉంటే బాగుంటుందని అభిప్రాయంతో ఉన్నవారు ఎటు చూడాలన్న కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది.
By: Tupaki Desk | 30 Jun 2025 12:00 PM ISTకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఏం చేస్తే బాగుంటుంది? ఎలా వెళ్తే బాగుంటుంది? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఏ మేరకు ఆమె పనిచేయాలి? అనేవి కాంగ్రెస్ పార్టీలోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ తరచుగా చర్చకు వస్తున్నాయి. దీనికి కారణం రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడం. కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఈ మూడు ఒకే లైన్లో నడుస్తున్నాయి. ఇక వైసిపి ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ ఆల్టర్నేట్ పార్టీ అంటూ మరొకటి లేదు. వైసీపీని వ్యతిరేకించేవారు, కూటమిలో ఉండాలి. లేదా కూటమిని వ్యతిరేకించేవారు వైసీపీలో ఉండాలి అన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయాయి.
ఈ పరిస్థితిలో ఆల్టర్నేట్ రాజకీయాలు ఉంటే బాగుంటుందని అభిప్రాయంతో ఉన్నవారు ఎటు చూడాలన్న కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. కానీ, ప్రత్యేక అజెండాను పెట్టుకున్న షర్మిల జోలికి పోయేందుకు చాలా మంది నాయకులు తటస్థంగా ఉన్నారు. వ్యక్తిగతంగా అజెండాలు పెట్టుకున్న వారు తమకు ఎటువంటి ప్రయోజనం చేకూరుస్తారు అన్నది ప్రజల్లోనూ చర్చగానే ఉంది. దీంతో షర్మిల వైపు ఎవరు చూడడం లేదు. ఈ పరిణామాలను అంచనా వేసుకోవడం లేదు. లేకపోతే.. కావాలనే చేస్తున్నారో తెలియదు కానీ మొత్తానికి షర్మిల అయితే ప్రస్తుతానికి సొంత అజెండానే అమలు చేస్తున్నారని ప్రధానంగా జరుగుతున్న చర్చ.
జగన్ ను విమర్శించడం, జగన్ ను తిట్టడం మాత్రమే రాజకీయాలు అన్నట్టుగా ఆమె భావిస్తున్నారు. అలా కాకుండా సీనియర్ నాయకులు.. రాజకీయ విశ్లేషకులు.. గతంలో పార్టీలో ఉండి బయటకు వచ్చినటు వంటి నాయకులు చెబుతున్న మాటలు ఆమె వింటే కొంతలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం కూడా షర్మిలకు ఉంటుందన్నది వారి సూచన. ప్రధానంగా కార్యకర్తలను, నాయకులను పెంచుకోవడం. అందుబాటులో ఉండడం. అపాయింట్మెంట్ ఉంటే తప్ప ఎవరూ రాకూడదని నిర్బంధాలను తొలగించడం వంటివి షర్మిల చేయాలి.
ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండేలాగా ఆమె వ్యవహరించాలని పార్టీ నాయకులు చెబుతున్న మాట. ప్రస్తుతం షర్మిలను ఎవరు కలవాలన్న ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని, విషయం చెప్పాలని ఒక నిబంధన కొనసాగుతోంది. దీంతో చాలామంది నాయకులు దూరంగా ఉంటున్నారు. పార్టీ పరంగా చర్చించాల్సిన అంశాలను కూడా వారు షర్మిల జోలికి తీసుకురావడం లేదు. అంతర్గత వ్యవహారాలను చాలా వరకు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుంకర పద్మశ్రీ వంటి వారు షర్మిలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఒక విజయవాడనే కాదు అనంతపురం, కడప, కర్నూలు, రాజమండ్రి లాంటి చోట కూడా షర్మిలకు తీవ్ర సెగ తగులుతోంది. ఇది పైకి కనిపించకపోయినా అంతర్గతంగా నాయకులు తీర్మానాలు చేస్తున్నారు. సీనియర్ నాయకులు కడు దూరంలో ఉంటున్నారు. పార్టీ పరంగా ప్రజల పక్షాన నిలవాల్సిన సమయంలో వ్యక్తిగతంగా ఆమె జగన్ ను కార్నర్ చేసుకోవడానికి చాలామంది తప్పుపడుతున్నారు. జగన్ ను కార్నర్ చేయడం తప్పు కాదు అని అంటున్నా.. ప్రజా సమస్యల కోణంలో ఆయనను నిలదీయాలని ఎక్కువగా అభిప్రాయపడుతున్నారు.
గతంలో జరిగిన పొరపాట్లు.... వైసిపి హయాంలో జరిగిన లోటుపాట్లతో పాటు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను కూడా ఎత్తిచూపడం ద్వారా మాత్రమే ప్రజలకు చేరువవుతామని చెప్తున్నారు. ఈ విషయాలను వదిలేస్తే మాత్రం షర్మిలకు ప్రయోజనం ఉండదని, తద్వారా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇంకా అక్కడే ఉండిపోతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు, కాబట్టి ఈ విషయాలను షర్మిల పరిగణలోకి తీసుకొని మార్పు దిశగా అడుగులు వేస్తే భవిష్యత్తు బాగుంటుందని సీనియర్లు చెబుతున్న మాట. మరి ఏం చేస్తారో చూడాలి.
