Begin typing your search above and press return to search.

అక్కడ హస్తవాసి చూస్తున్న షర్మిల!

ఏపీలో ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ ఎత్తి గిల్లుతున్న సూచనలు లేవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా వైసీపీకి మళ్ళిపోయింది.

By:  Tupaki Desk   |   18 Jun 2025 10:20 PM IST
అక్కడ హస్తవాసి చూస్తున్న షర్మిల!
X

ఏపీలో ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ ఎత్తి గిల్లుతున్న సూచనలు లేవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా వైసీపీకి మళ్ళిపోయింది. వైసీపీకి జగన్ వంటి ధీటైన నాయకుడు ఉన్నారు. ఆయన ఒకసారి సీఎంగా కూడా చేశారు. దాంతో పాటు పదిహేనేళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ ధీటుగా మారారు.

ఇక ఆయన చెల్లెలుగా జగనన్న వదిలిన బాణంగా రాజకీయాల్లోకి వచ్చిన షర్మిలకు వైసీపీలో ఏమీ లేకుండా పోయింది. దాంతో ఆమె ఒక ప్రాంతీయ పార్టీని తెలంగాణాలో పెట్టి మళ్ళీ ఏపీలోకి వచ్చారు. కాంగ్రెస్ కి ఆమె ఏపీ చీఫ్ గా ఉంటున్నారు. ఆమె ఈ పదవీ బాధ్యతలు చేపట్టి ఏణ్ణర్థం అవుతోంది.

అయినా సరే ఏపీలో కాంగ్రెస్ మాత్రం బలపడింది లేదు సరికదా ఇంకా తగ్గిపోతోంది. మరో వైపు చూస్తే కాంగ్రెస్ లో సీనియర్ నేతలు కొందరు ఇంకా మిగిలారు. అయితే వారు పూర్తిగా మౌనం దాల్చారు. పార్టీలో ఉన్నట్లా లేనట్లా అన్నట్లుగా ఉన్నారు. షర్మిల అయితే తనదైన శైలిలో రాజకీయం చేసుకుని పోతున్నారు.

ఇక ఆమె చూపు ఇపుడు ఉత్తరాంధ్రా జిల్లాల మీద పడింది. ఉత్తరాంధ్రాలో కాంగ్రెస్ ఏమైనా బలపడుతుందేమో అన్న ఆలోచనలతో ఆమె ముందుకు వస్తున్నారు. ఆరు జిల్లాల కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆమె భేటీలు నిర్వహిస్తున్నారు. ఒక విధంగా పార్టీని కదిలించాలని చూస్తున్నారు.

ఉత్తరాంధ్రాలో కాంగ్రెస్ ఏమైనా పుంజుకుంటుందేమో అన్న ఆశలతో ఆమె ఉన్నారు. ఆమె తరచుగా విశాఖ వస్తున్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ మీద గళం విప్పుతున్నారు. అయితే ఈసారి ఆమె ఉత్తరాంధ్రలోని రూరల్ ప్రాంతాలను పర్యటించాలని నిర్ణయించుకున్నారు అని అంటున్నారు.

పార్టీకి ఉన్న నాయకులకు సరైన దిశా నిర్దేశం చేయడం ద్వారా వారిని ఉత్సాహపరచాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో ఎస్టీ నియోజకవర్గాలు అయిదు ఉన్నాయి. అలాగే ఎస్సీ నియోజకవర్గాలు రెండు ఉన్నాయి. దాంతో వీటిలో అయినా కాంగ్రెస్ కి ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ ని గట్టిపరచుకుంటే వచ్చే ఎన్నికలలో అయినా ఇక్కడ నుంచి బోణీ కొట్టవచ్చు అన్నది షర్మిల ఆలోచనగా ఉంది అని అంటున్నారు.

ఒకనాడు విశాఖ సిటీలో కాంగ్రెస్ బలంగా ఉండేది. అనేక ఎన్నికల్లో ఎంపీ సీటుని గెలుచుకుంది. మేయర్ పదవిని కూడా పలు మార్లు అందుకుంది. దాంతో విశాఖ మీద కూడా ఫోకస్ పెడితే గతంలో ఉన్న బలాన్ని ఎంతో కొంత తిరిగి అందుకోగలమని ఆమె చూస్తున్నారు.

దాంతో వరసబెట్టి ఆమె మన్యం జిల్లాలతో పాటు విశాఖ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో కాంగ్రెస్ నాయకులతో సమావేశాలను పెట్టి భేటీ కాబోతున్నారు. ఆమె తొందరలోనే జిల్లాల పర్యటనలు చేపడతారని అది కూడా ఉత్తరాంధ్రా నుంచి ఉండొచ్చని sపార్టీ వర్గాలు అంటున్నాయి. మరి ఉత్తరాంధ్రాలో హస్తవాసి ఎలా ఉందో కాంగ్రెస్ చీఫ్ స్వయంగా చూడనున్నారు.