దత్తపుత్రుడు.. జగన్ డైలాగ్ రివర్స్ అటాకింగ్
మాజీ సీఎం జగన్ పై ఆయన రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న రివర్స్ అటాకింగ్ ఆసక్తికరంగా మారుతోంది.
By: Tupaki Desk | 22 Jun 2025 6:53 PM ISTమాజీ సీఎం జగన్ పై ఆయన రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న రివర్స్ అటాకింగ్ ఆసక్తికరంగా మారుతోంది. ‘దత్తపుత్రుడు’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను తరచూ విమర్శించే జగన్.. ఇప్పుడు అదే ఆరోపణను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా తన సోదరి నుంచి ఆయన ఆ విమర్శను ఎదుర్కొంటుండటం చర్చనీయాంశమవుతోంది. ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడు అంటూ షర్మిల విమర్శిస్తున్నారు. గత కొన్నేళ్లుగా జగన్ కు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్న షర్మిల ఎన్ని విమర్శలు చేసినా వాటికన్నా తీవ్రంగా ‘దత్తపుత్రుడు’ కామెంట్ ఎక్కువగా హైలెట్ అవుతోందని అంటున్నారు. దీనికి పరోక్షంగా జగనే కారణమన్న వాదన వినిపిస్తోంది.
ఏపీ రాజకీయాల్లో ‘దత్తపుత్రుడు’ అనే ట్యాగ్ లైన్ హైలెట్ గా నిలుస్తోంది. విపక్ష నేత జగన్ ‘దత్తపుత్రుడు’ డైలాగ్ ను బాగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. జగన్ సీఎంగా ఉండగా, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన సేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చంద్రబాబుకు దత్తపుత్రుడుగా అభివర్ణించి విమర్శలు గుప్పించేవారు. ఇక వైసీపీ శ్రేణులు కూడా పవన్ ను పదేపదే ‘దత్తపుత్రుడు’ అంటూ సంభోదించేవారు. పవన్ కూడా చంద్రబాబుకు ఓ కుమారుడిలా అండగా నిలిచి పోరాడారు. వైసీపీ ఎన్ని విమర్శలు చేసినా చంద్రబాబుతో జోడీ కట్టి అధికారంలోకి వచ్చారు.
ఇక జగన్ విపక్షంలోకి జారుకున్నాక ఇప్పుడు రివర్స్ లో ఆయన ‘దత్తపుత్రుడు’ అన్న విమర్శను ఎదుర్కొంటుండటం ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడుగా ఉన్నాడని కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా మోడీ-జగన్ మధ్య రహస్య స్నేహం నడుస్తోందని షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. మోడీ మద్దతు ఉండటం వల్లే జగన్ ఆడింది ఆటగా, పాడింది పాటగా ఉందని అంటున్నారు షర్మిల. తన బాబాయ్ వివేకా హత్య కేసులోని నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతోపాటు వైసీపీ హయాంలో జరిగిన పలు స్కాంల్లో జగన్ ను మోడీ కాపాడుతున్నారని షర్మిల ధ్వజమెత్తుతున్నారు.
వైసీపీ అధికారంలో ఉండగా, మోడీ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించారని, ఇప్పుడు కూడా తన పార్టీ నేతల ద్వారా బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన కాపాడేందుకు మోడీ కూడా ఆసక్తి చూపుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మోడీ-జగన్ బంధంపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు ఆమె జగన్ పరిచయం చేసిన ‘దత్తపుత్రుడు’ కాన్సెప్ట్ ను ఎంచుకున్నారని అంటున్నారు. మొత్తానికి అన్నాచెల్లెళ్ల వార్ ‘దత్తపుత్రుడు’ కామెంట్ తో మరింత ఇంట్రెస్టింగ్ గా మారిందని అంటున్నారు.
