విమర్శలే తప్ప.. సలహాలేవి షర్మిలక్కా!
మరి ఇప్పుడు రాజధాని అమరావతి విషయంలో షర్మిల చేస్తున్నదేంటి? ఈ యాగీకి అర్ధమేంటి?
By: Tupaki Desk | 3 May 2025 9:33 PM ISTరాజధాని నిర్మాణానికి పునాదులు పడుతుంటే ఓర్వలేరు. పోలవరం కడుతుంటే.. మనసు సహించదు. విజయవాడ వరదల్లో నిలువెత్తు నీటిలో నిలబడి సాయం చేస్తే.. కూడా బురద జల్లుతారు. మరి ఒక ప్రభుత్వం ఏం చేయాలి? నానా తిప్పలు పడి.. మసకబారిన రాజధానిని పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తే.. బాధ్యతాయుత రాజకీయాలుచేస్తున్నామనిచెబుతున్న కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఎలా వ్యవహరించాలి. కుదిరి తే సాయం చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా.. రాజధానికే మొగ్గు చూపుతామని ప్రకటించి కాబట్టి.
కుదిరితే.. అమరావతికి సలహాలు ఇవ్వాలి. పోలవరం నిర్మాణానికి సూచనలు చేయొచ్చు. సొమ్ములు రాబట్టుకునేందుకు ప్రతిపక్ష(ఎవరూ గెలవకపోయినా) నాయకురాలిగా సూచనలు చేయొచ్చు. పెట్టుబడి దారులను కూడా ఆహ్వానించొచ్చు. లేదా.. రాష్ట్ర ప్రగతిని ఆకాంక్షిస్తూ.. ప్రకటనలు కూడా చేయొచ్చు. కానీ, చంద్రబాబును విమర్శిస్తూ.. రాజధానిపై దుమ్మెత్తి పోయడం ఎందుకు? ఇదీ.. ఇప్పుడు చర్చనీయాం శం అయిన విషయం. జగన్ మూడు రాజధానుల పేరు ఎత్తి.. మూర్ఖుడిగా పేరు తెచ్చుకున్నాడని.. ఒకప్పుడు షర్మిలే వ్యాఖ్యానించారు.
మరి ఇప్పుడు రాజధాని అమరావతి విషయంలో షర్మిల చేస్తున్నదేంటి? ఈ యాగీకి అర్ధమేంటి? ''రాజకీయాల్లో ఉంటే.. ఎంతసేపూ విమర్శలే కాదు.. చంద్రబాబూ.. జరుగుతున్న, జరగబోయే అభివృద్ధిని కూడా చూడు'' అని అసెంబ్లీ సాక్షిగా షర్మిల తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కామెంట్లు ఇంకా.. వీడియోలరూపంలో వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఆ తండ్రి బిడ్డగా.. అదే పార్టీ కాడిని భుజాన వేసుకున్న షర్మిల.. ఇప్పుడు చేస్తున్నదేంటి? అభివృద్ధి చేస్తున్న తీరును ఓర్చుకోలేక ఇలా రాజకీయం చేస్తోందని అనుకోవాలా? !
ఏం జరిగింది?
తాజాగా అమరావతి పునః ప్రారంభ పనులపై మరోసారి షర్మిల అక్కసు వెళ్లగక్కారు. ''ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాజధానికి కావాల్సింది అప్పులు కాదు..నిధులు. రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని,అప్పు పుట్టనిదే జీతాలకు దిక్కులేదని.. చెప్పే మీరు రాజధాని నిర్మాణానికి ఎవరిని అడిగి రూ.60 వేల కోట్లు అప్పు తెస్తున్నారు? వడ్డీల భారం మోసేదెలా? వరల్డ్ బ్యాంక్, హడ్కోల దగ్గర రాష్ట్రాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు?'' అని షర్మిల నిలదీశారు. ఈ వాదనే సరైంది కాదని మేధావులు చెబుతున్నారు. స్వయం సంపద సృష్టి అని అమరావతి గురించి చంద్రబాబు చెబుతున్నది వినడం లేదా? అని నిలదీస్తున్నారు.
