Begin typing your search above and press return to search.

పాక్ 'షరీఫ్'.. మరోసారి ఆయనే..?

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ), పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్ షరీఫ్) పార్టీలు తమదే విజయమని ప్రకటించుకుంటున్నాయి.

By:  Tupaki Desk   |   10 Feb 2024 10:12 AM GMT
పాక్ షరీఫ్.. మరోసారి ఆయనే..?
X

పొరుగు దేశం పాకిస్థాన్ లో ప్రస్తుతం ఎన్నికల హంగామా నడుస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ), పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్ షరీఫ్) పార్టీలు తమదే విజయమని ప్రకటించుకుంటున్నాయి. అసలే బలహీన ప్రజాస్వామ్యం.. దానిపై సైన్యం విపరీత పెత్తనం.. దీంతో ఏం జరుగుతుందో అనే ఆందోళన ఆసక్తి నెలకొంది. స్వాతంత్ర్యం అనంతరం ప్రజాస్వామ్యంలో కంటే సైనిక పాలనలోనే ఎక్కువ కాలం మగ్గిన దేశం పాకిస్థాన్. ఇప్పుడు కూడా మళ్లీ అదే పరిస్థితి రానుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

రెండు రోజులుగా లెక్కింపు..

పాకిస్థాన్ కు నవాజ్ షరీఫ్ మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు. మొన్నటివరకు ఆయన తమ్మడు షాబాజ్ ప్రధానిగా ఉన్నారు. 2108 ఎన్నికల్లో గెలిచిన ఇమ్రాన్ ఖాన్ ఈసారి పోటీకి దూరమయ్యారు. అయితే, మరో ప్రధాన పార్టీ దివంగత బెనజీర్ భుట్టోకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)దీ ప్రధాన పాత్రనే. ఆమె కుమారుడు బిలావల్ భుట్టో ఆ పార్టీని నడిపిస్తున్నారు. కాగా, రెండు రోజుల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పటికీ.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. నవాజ్‌ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

రాజకీయ సుస్థిరతకు చేతులు కలిపి..

పీటీఐ, పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) తమదే విజయమని చెబుతున్న క్రమంలో ప్రభుత్వ ఏర్పాటు ఎలాగనే ప్రశ్న తలెత్తనుంది. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో రాజకీయ, ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువచ్చేందుకు నవాజ్‌నేతృత్వంలోని పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీ కలిసి పనిచేయాలని అంగీకారానికి వచ్చాయి. ఇరు పక్షాలకు చెందిన నేతలు శుక్రవారం రాత్రి లాహోర్‌ లో సమావేశమయ్యారు.

ఇమ్రాన్ ఆడియో ప్రసంగంతో..

తమ నేత ఇమ్రాన్ ఖాన్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రసంగాన్ని పార్టీ విడుదల చేసింది. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పరోక్షంగా నవాజ్ షరీఫ్ పై విమర్శలు గుప్పించారు. 'మీ ఓట్ల వల్ల లండన్‌ ప్లాన్‌ విఫలమైంది. పాకిస్థానీ ప్రజలు ఆయన్ను విశ్వసించడం లేదు. మీ ఓటు శక్తిని ప్రతిఒక్కరూ చూశారు. ఇక మనం పోలింగ్‌ ఫలితాన్ని రక్షించుకోవాల్సి ఉంది. భారీగా నమోదైన పోలింగ్‌ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపర్చింది. 30 సీట్లలో వెనకబడి ఉన్నప్పటికీ విక్టరీ ప్రసంగం చేసిన తెలివితక్కువ నాయకుడు షరీఫ్‌' అని మండిపడ్డారు.

ఆర్మీ ఓకే అంటోంది..

పాకిస్థాన్ లో ప్రభుత్వం ఏదైనా ఆర్మీదే ప్రధాన పెత్తనం. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ విజయవంతమైదంటూ ఆర్మీ చీఫ్ జనరల్‌ అసీమ్‌ మునీర్‌ ప్రజలకు

శుభాకాంక్షలు తెలపడం గమనార్హం. సొంత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 25 కోట్ల మంది ప్రజల కోసం అరాచక పాలనకు దూరంగా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలి అని పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే.. సైన్యం ఇమ్రాన్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తేలుతోంది.

పట్టు విడవని ఇమ్రాన్..

ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా ఉండడంతో కేంద్రం, రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు పీటీఐ కూడా కూడా మిత్ర పక్షాలతో చర్చలు జరుపుతోంది. ఇమ్రాన్‌ బలపరిచిన అభ్యర్థులు 99 సీట్లలో విజయం సాధించారు. పీఎంఎల్‌-ఎన్‌ 71, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) 53, చిన్న పార్టీలు 27 స్థానాలను నెగ్గాయి. 15 సీట్ల ఫలితం రావాల్సి ఉంది.

ప్రధాని ఆయనేనా..?

ఓటింగ్‌ ముగిసి 40 గంటలు గడుస్తున్నా పాక్ లో ఫలితాలపై స్పష్టమైన ప్రకటన రాకపోవడం పట్ల అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పాకిస్థాన్ ప్రధానిగా మరోసారి నవాజ్ షరీఫ్ పీఠం ఎక్కుతారా? అనే ఊహాగానాలు వస్తున్నాయి. మొన్నటివరకు లండన్ ప్రవాసంలో ఉన్న ఆయన ఆరు నెలల కిందటనే తిరిగొచ్చారు. కాగా, నవాజ్ కాస్త భారత్ పట్ల సానుకూలంగా ఉంటారనే పేరుంది. 2015లో ఆయన విదేశాల నుంచి వస్తూ షరీఫ్ జన్మదినం సందర్భంగా నేరుగా పాకిస్థాన్ వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు.