నాలుగు రోజుల మిస్సింగ్ మిస్టరీ.. కేరళ టెకీ శరణ్య కథపై సందేహాలు!
కర్ణాటక అడవుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి నాలుగు రోజుల పాటు మిస్సింగ్ అయిన కేరళ టెకీ శరణ్య ఘటన ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది.
By: A.N.Kumar | 8 April 2026 4:11 PM ISTకర్ణాటక అడవుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి నాలుగు రోజుల పాటు మిస్సింగ్ అయిన కేరళ టెకీ శరణ్య ఘటన ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. మొదట ఆమె సురక్షితంగా బయటపడటం అందరికీ ఊరటనిచ్చినప్పటికీ ఇప్పుడు ఆమె చెప్పిన కథపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు.. రాజకీయ వర్గాల ఫిర్యాదులు ఈ ఘటనను మరింత చర్చనీయాంశంగా మార్చాయి.
ఏప్రిల్ 2న శరణ్య తన స్నేహితులతో కలిసి కర్ణాటకలోని కొడగు జిల్లాలో ట్రెక్కింగ్‌కు వెళ్లింది. అయితే ఆ బృందం నుంచి ఆమె అనుకోకుండా తప్పిపోయింది. నాలుగు రోజుల పాటు ఆమె ఆచూకీ లభించకపోవడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. డ్రోన్లు, ట్రాకింగ్ జాగిలాలు, అటవీ శాఖ సిబ్బంది, ప్రత్యేక బలగాలతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. చివరికి ఏప్రిల్ 5న ఆమెను సురక్షితంగా కనుగొన్నారు.
అయితే ఆమె బయటపడిన తర్వాత చెప్పిన వివరాలే ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి. తాను ట్రెక్కింగ్‌కు వెళ్తున్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకెళ్లలేదని, నాలుగు రోజుల పాటు కేవలం నీళ్లతోనే జీవించానని శరణ్య చెప్పింది. రోజుకు సుమారు 3 లీటర్ల నీరు తాగుతూ అడవిలో గడిపానని ఆమె తెలిపింది. కానీ ఈ వాదనలను సోషల్ మీడియాలో చాలామంది నమ్మడం లేదు.
“నాలుగు రోజుల పాటు ఆహారం లేకుండా అడవిలో జీవించడం సాధ్యమా?”, “అడవిలో జంతువుల మధ్య ఎలాంటి భయం లేకుండా ఎలా ఉన్నారు?”, “ఇంత ఉత్సాహంగా ఎలా కనిపిస్తున్నారు?” వంటి ప్రశ్నలు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. కొందరు అయితే ఈ ఘటన వెనుక మరేదైనా దాగి ఉందని అనుమానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో విషయం మరింత సీరియస్ అయింది.
ఈ నేపథ్యంలో కొడగు జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ప్రజల సొమ్ముతో భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినందున అసలు నిజం బయటపడాలని వారు డిమాండ్ చేశారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.
ఇక పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. శరణ్యను ఇప్పటికే ప్రశ్నించినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న అనుమానాల కోణంలో కూడా విచారణ కొనసాగించనున్నట్లు తెలిపారు. “ఆమె చెప్పిన వివరాల్లో మొదటగా ఎలాంటి అనుమానం కనిపించలేదు. కానీ ఇప్పుడు వస్తున్న ఆరోపణలను కూడా పరిశీలిస్తాం. అసలు ఏమి జరిగిందో స్పష్టంగా తెలుసుకుంటాం” అని ఒక పోలీసు అధికారి పేర్కొన్నారు.
మొత్తానికి ప్రాణాపాయం నుంచి బయటపడిన ఈ ఘటన ఇప్పుడు అనుమానాల ముసుగులోకి వెళ్లింది. శరణ్య కథ నిజమా? లేక మరేదైనా కోణం ఉందా? అన్నది పోలీసుల దర్యాప్తుతోనే తేలాల్సి ఉంది.
