Begin typing your search above and press return to search.

అబ్బే.. గడియారంలో ఆయన ‘‘టైం’’ అసలు బాలేదు

శరద్ పవార్.. మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం. జాతీయ రాజకీయాల్లోనూ కీలక శక్తి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన ప్రత్యేకతను విస్మరించలేం.

By:  Tupaki Desk   |   7 Feb 2024 1:30 PM GMT
అబ్బే.. గడియారంలో ఆయన ‘‘టైం’’ అసలు బాలేదు
X

అత్యంత పెద్ద రాష్ట్రానికి అత్యంత చిన్నవయసులో ముఖ్యమంత్రి అయ్యారాయన.. ఆపై కేంద్రంలో కీలక శాఖ అయిన రక్షణ శాఖకు మంత్రిగా పనిచేశారు.. ఈ మధ్యలో కాంగ్రెస్ వంటి పార్టీలో నంబర్ 2గా వ్యవహరించారు. అయితే, సోనియాగాంధీ జాతీయతను లేవనెత్తి సొంతంగా పార్టీని స్థాపించుకున్నారు. సొంత రాష్ట్రంలో కీలక శక్తిగా నిలిచారు. మళ్లీ అదే కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల అనంతరం పొత్తు కుదుర్చుకుని పదేళ్లు అధికారంలో కొనసాగారు. దీన్నిబట్టే ఆయన ఎంతటి రాజకీయ చాణక్యుడో అర్థం చేసుకోవచ్చు. అయితే.. అలాంటి నాయకుడి ‘గడియారం’లో ఇప్పుడు టైం బాగోలేదు.


25 ఏళ్ల ప్రస్థానం..

శరద్ పవార్.. మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం. జాతీయ రాజకీయాల్లోనూ కీలక శక్తి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన ప్రత్యేకతను విస్మరించలేం. అలాంటి శరద్ పవార్ ఇప్పుడు తీవ్ర రాజకీయ సంకట స్థితిలో ఉన్నారు. సరిగ్గా 25 ఏళ్ల కిందట సోనియాగాంధీని ఎదిరించి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని

స్థాపించిన శరద్ పవార్ కు.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ కాలేదంటే నమ్మాల్సింది. 83 ఏళ్ల శరద్ పవార్ కు జీవిత చరమాంకంలో ఇదో పెద్ద చేదు అనుభవం. గత ఏడాదిలో జూలైలో శరద్ అన్న కుమారుడు అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చి శివసేన (శిందే)-బీజేపీ కూటమి ప్రభుత్వంలో చేరిపోయారు. మొత్తం ఎమ్మెల్యేల్లో మూడో వంతు ఆయనతోనే వెళ్లిపోయారు. పెద్ద పవార్ కీలక అనుచరులూ వీరిలో ఉన్నారు. ఇపుడు పార్టీ ఎన్నికల గుర్తు ‘గడియారం’ సహా అసలు పార్టీనే చేజారిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్టు ప్రకటించింది. అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నందునే అజిత్ వర్గానికే పార్టీ చిహ్నం, గుర్తు కేటాయించింది.

ఇండియాను ఇలా దెబ్బకొట్టారు..

విపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడడంతో బిహార్ సీఎం నితీశ్ కుమార్, శరద్ పవార్ కీలక పాత్రధారులు. అలాంటిది నితీశ్ ను ఎన్డీఏలోకి లాగేసిన బీజేపీ.. శరద్ పవార్ ను ఈ విధంగా దెబ్బకొట్టిందన్నమాట. కాగా, త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా శరద్ పవార్ గ్రూపునకు ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతినిచ్చింది. కొత్త గుర్తు కోసం బుధవారం ప్రతిపాదన పంపాలని కోరింది. వాస్తవానికి శిందే శివసేనను చీల్చిన కేసులో ఉద్దవ్‌ ఠాక్రే వర్గానికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. పవార్‌ కూ అలాంటి పరిస్థితే ఎదురైంది. కాగా, మంగళవారం ఎన్నికల సంఘం విచారణకు శరద్ స్వయంగా హాజరయ్యారు. శివసేన తరహాలో కాకుండా భిన్నమైన ఆదేశాలు వస్తాయని అంచనా వేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే జీవించి లేరు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ మాత్రం బతికే ఉన్నారు. అందుకే పవార్ వర్గం ఆశలు పెట్టుకుంది. కానీ.. అవన్నీ అడియాశలయ్యాయి.

కష్టాలు కొత్తకాదు..

శరద్ పవార్ వయసు 83. ఈ సంఖ్యను తిరగేస్తే వచ్చేది 38. సరిగ్గా ఈ వయసులోనే 45 ఏళ్ల కిందట మహారాష్ట్రకు సీఎం అయ్యారాయన. ఆ తర్వాత ఎన్నో ఒడిదొడుకులను చూశారు. సోనియా ధిక్కరించి పార్టీని పెట్టుకున్నారు. మళ్లీ కాంగ్రెస్ తో కలిశారు. రాష్ట్రంలో, కేంద్రంలో పదవులు పొందారు. అయితే, ఈ అన్ని సందర్భాల్లో ఆయన వెన్నంటి అజిత్ పవార్ ఉన్నారు. ఇప్పుడు అదే అజిత్ పార్టీని చీల్చారు. గుర్తునూ ఎత్తుకెళ్లారు. అందులోనూ శదర్ పవార్ కు వయసు పైబడింది. ఇలాంటి సమయంలో ఆయన ఏం చేస్తారో చూడాలి.