Begin typing your search above and press return to search.

శరద్ పవార్ కళ్ళ మీద ఆ సీటు జారిపోతుందా ?

శరద్ పవార్ మరాఠా నాయకుడు. కేవలం మూడున్నర పదుల వయసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రాజకీయ ఘనాపాఠి.

By:  Tupaki Desk   |   29 April 2024 3:55 AM GMT
శరద్ పవార్ కళ్ళ మీద ఆ సీటు జారిపోతుందా ?
X

శరద్ పవార్ మరాఠా నాయకుడు. కేవలం మూడున్నర పదుల వయసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రాజకీయ ఘనాపాఠి. ఆయన రాజకీయ చాతుర్యం అద్భుతం. నాడు తలపండిన రాజకీయ యోధులను తట్టుకుని మరీ నిలబడిన రాజకీయ ధీరుడిగా చెబుతారు. ఆయనకు లక్ ఫేవర్ చేయలేదు కానీ ప్రధాని అయ్యే తాహతు స్తోమత సామర్ధ్యం ఆయనలో నిండుగా ఉన్నాయి.

ఆయన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీలను చూసి ఉన్నారు. వారితో కలసి రాజకీయం చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ లో కీలక నేతగా ఉంటూ పలు మార్లు బయటకు వెళ్ళి మళ్లీ వచ్చి కలిశారు. ఇక సోనియాగాంధీతో విభేదించి రెండున్నర దశాబ్దాల క్రితం ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. అలా ఆ పార్టీ ద్వారా మహారాష్ట్రలో కీలకంగా మారుతూ వస్తున్నారు.

ఆయన రాజకీయాల్లో కీలకంగా ఉంటూ సుదీర్ఘ కాలం బారామతి లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. ఆయన తొలిసారి కాంగ్రెస్ టికెట్ మీద 1984లో ఇక్కడ నుంచి ఎంపీ అయ్యారు. ఆ తరువాత 1991, 1996, 1998, 1999, 2004లలో ఇదే సీటు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు.

ఇక ఆయన రాజకీయ వారసురాలిగా రంగంలోకి దిగిన కుమార్తె సుప్రియా సూలే 2009లో తొలిసారిగా బారామతి నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. 2014, 2019లో కూడా గెలిచి హ్యాట్రిక్ ఎంపీ అనిపించుకున్నారు. ఇపుడు ఆమె గెలుపు కోసం కష్టపడాల్సి వస్తోంది.

దానికి కారణం శరద్ పవార్ కి అండదండగా ఉంటూ వచ్చిన సొంత మేనల్లుడు అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపి మహరాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. ఎన్సీపీని నిలువునా ఆయన చీల్చారు. ఇపుడు ఆయన బారామతి మీద కన్నేశారు. తన సతీమణి సునేత్ర అజిత్ పవార్ ని ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయిస్తున్నారు. దాదాపుగా మూడున్నర దశాబ్దాలుగా శరద్ పవార్ కి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇపుడు ఒకే కుటుంబం నుంచి కత్తులు దూసుకున్నారు.

దీంతో ఇక్కడ సుప్రియా సూలే సునేత్రల మధ్యన భారీ పోరు సాగనుంది. శరద్ పవార్ కి మరో కష్టమేంటి అంటే ఆయన పార్టీని చీలిక పార్టీగా గుర్తించి కొత్త గుర్తు ఇచ్చారు. అసలైన పార్టీగా అజిత్ పవార్ నే ఈసీ గుర్తించింది. దాంతో దాదాపు ఎనిమిదిన్నర పదుల వయసులో శరద్ పవార్ ఎన్నడూ లేనంతగా ఈసారి కష్టపడాల్సి వస్తోంది. తన కుమార్తెని గెలిపించుకోవడానికి ఆయన అన్ని శక్తులూ బయటకు తీయాల్సి వస్తోంది.

అండగా ఉన్న మేనల్లుడు ప్రత్యర్ధిగా మారారు. పైపెచ్చు బీజేపీ మద్దతు ఉంది. బారామతిలో బీజేపీకి కూడా బలం ఎక్కువగానే ఉంది. ఈ సీటు మీద బీజేపీ దశాబ్దాలుగా కన్నేసినా చేజిక్కలేదు. ఇపుడు మిత్రపక్షమైన అజిత్ పవార్ ఎన్సీపీకి మద్దతు ఇస్తోంది. పవార్ కుటుంబలో పవర్ కోసం సాగుతున్న ఈ పోరు మహారష్ట్రలో ఆకట్టుకుంటోంది.ఈ ఎన్నికల్లో సుప్రియా సూలే గెలిస్తే శరాద్ పవార్ పార్టీ ఉంటుంది అస్తిత్వం ఉంటుంది. రాజకీయ వారసత్వం ఉంటుంది. లేకపోతే ఎన్సీపీకి మొత్తం అధినేతగా అజిత్ పవార్ అవతరిస్తారు. బీజేపీ కూడా అదే కోరుకుంటోంది అని అంటున్నారు.