Begin typing your search above and press return to search.

పెద్ద పవార్ పవర్ గేమ్.. బీజేపీతో కలవాలట.. కలవరట..

ఈ వ్యవధిలో శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి సహా కీలక శాఖలు చూశారు

By:  Tupaki Desk   |   14 Aug 2023 6:24 AM GMT
పెద్ద పవార్ పవర్ గేమ్.. బీజేపీతో కలవాలట.. కలవరట..
X

మహారాష్ట్ర అంటేనే కాకలు తీరిన రాజకీయం. అందులో శరద్ పవార్ మరింత రాటుదేలిన రాజకీయ నాయకుడు. అతిపెద్ద రాష్ట్రానికి 38 ఏళ్లకే ముఖ్యమంత్రి కావడం అంటే మామూలు మాటలా మరి..? కాంగ్రెస్ వంటి పార్టీని ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టుకుని గత పాతికేళ్లలో కొద్ది కాలం మినహా అధికారాన్ని అనుభవించడం అంటే మామలూ విషయమా మరి..? దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేని ప్రత్యేకత పవార్ ది. 82 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ కేంద్రంలో, రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.

కలవాలట.. కలవరట..

1999లో ఎన్సీపీని స్థాపిస్తే అప్పటినుంచి 2014 వరకు మహారాష్ట్రలో అధికారంలో ఉందా పార్టీ. ఈ వ్యవధిలో శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి సహా కీలక శాఖలు చూశారు. ఇక 2004-14 మధ్య శరద్ పవార్ కేంద్ర మంత్రి. 2019-22 మధ్య ఎన్సీపీ అక్కడి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో భాగస్వామి. దీన్నిబట్టే పవార్ లకు పవర్ తో ఎంత అనుబంధం ఉందో తెలిసిపోతుంది. అయితే.. నిరుడు మహా వికాస్ అఘాడీ సర్కారు కూలిపోవడంతో అజిత్ పవర్ కోల్పోయారు. ఏడాది పదవీ వియోగాన్నే ఆయన భరించలేకపోయారు. జూన్ లో ఏకంగా బాబాయ్ ను ధిక్కరించి ఎన్సీపీని చీల్చి బీజేపీ సర్కారులో చేరిపోయారు.

ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఓవైపు శరద్ పవార్ ప్రతిపక్ష ''ఇండియా'' కూటమి ప్రయత్నాల్లో ఉంటే.. మరోవైపు అజిత్ ఆయనకు వెన్నుపోటు పొడిచినట్లుగా ఈ తతంగం అంతా సాగింది. కానీ, పెద్ద పవార్ ఆశీస్సులతోనే చిన్న పవార్ బీజేపీ ప్రభుత్వంలోకి వెళ్లారనే కథనాలు ఉన్నాయి. ఆ తర్వాత శరద్ పవార్ ను తిరుగుబాటు ఎమ్మెల్యేలు కలవడం, ఆయన ఆశీస్సులు కావాలంటూ కోరడం అంతా ఒక డ్రామాలా సాగింది. ఇప్పటికీ శరద్ పవార్ ఇండియా కూటమి వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, అది అనుమానాస్పదంగానే..?

పదేపదే కలుస్తూ..

సహజంగా రాజకీయ పార్టీల్లో అధినేతకు వెన్నుపోటు పొడిచిన వారు తర్వాతి కాలంలో వారితో ఉప్పునిప్పు తరహాలో ఉంటారు. కానీ, మహారాష్ట్రలో అదేంటో అలా కనిపించదు. ''బాబాయ్ నీ వయసైపోయింది. తప్పుకో'' అంటూ కటువుగా మాట్లాడిన అజిత్ పవార్ తర్వాత ఆయన వద్దకు పలుసార్లు తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లారు. దీని వెనుక మతలబు ఏమిటా? అని అందరూ తలలు బద్దలు కొట్టుకుంటుంటే.. తాజాగా శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''బీజేపీలో చేరాలని కొంతమంది శ్రేయోభిలాషులు నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ, ఆ ప్రసక్తే లేదు'' అని చెప్పారు.

ఇదంతా ఆయనను అజిత్ మరోసారి కలవడంతో జరిగింది. అయితే, అజిత్‌ తన సోదరుడి కుమారుడని.. అతడిని కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఒకే ఇంట్లోని సీనియర్‌ వ్యక్తి.. తన కుటుంబంలోని మరో వ్యక్తిని కలవాలని కోరుకుంటే.. దాంతో ఎటువంటి సమస్య ఉండకూడదన్నారు. ఇదే సమయంలో ఎన్సీపీలోని కొందరు నేతలు బీజేపీతో చేతులు కలిపారని కానీ తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీకి.. ఎన్సీపీ రాజకీయ విధానానికి పొంతన కుదరదని పేర్కొన్నారు.

ఇండియా కూటమి భేటీ ముంగిట..

ప్రతిపక్షాల మహా కూటమి ''ఇండియా''.. ఇప్పటికే పట్నా, బెంగళూరులో సమావేశమైంది. బెంగళూరులోనే ఇండియాగా పేరు పెట్టుకుంది. తదుపరి సమావేశం ఈ నెలాఖరున ముంబైలో జరగనుంది. ఆ కూటమిని ఇరుకున పెట్టేందుకు అజిత్ పవార్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇటీవల ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్‌ కూడా ఎన్డీయేలో చేరతారనే వదంతులు రావడం కూడా ఈ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.