Begin typing your search above and press return to search.

ఇండియా కూటమికి శరద్ పవార్ బిగ్ హ్యాండ్ ?

ఇంకా పుట్టీ పుట్టకముందే ఇండియా పేరిట ఉన్న విపక్ష కూటమి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది

By:  Tupaki Desk   |   16 Aug 2023 3:30 PM GMT
ఇండియా కూటమికి శరద్ పవార్ బిగ్ హ్యాండ్ ?
X

ఇంకా పుట్టీ పుట్టకముందే ఇండియా పేరిట ఉన్న విపక్ష కూటమి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ కూటమిని చీల్చేందుకు ఎటూ బీజేపీ వ్యూహాలు ఉండనే ఉన్నాయి. వాటికి తోడు అన్నట్లుగా ఇండియా కూటమిలో లుకలుకలు రోజుకు ఒకటి వంతున బయటపడుతున్నారు కూటమిలో ఉన్న విపక్ష నేతల మధ్య ఒకరి మీద ఒకరికి విశ్వాసం లేదని అంటున్నారు.

అదే సమయంలో వృద్ధ నేత, సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ అయిన శరద్ పవార్ ఇండియా కూటమికి బిగ్ హ్యాండ్ ఇవ్వబోతున్నట్లుగా ఢిల్లీ స్థాయిలో అయితే ప్రచారం సాగుతోంది. దీని వెనక బీజేపీ రాజకీయ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. ఆగస్ట్ నెల మొదట్లో పూణెలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, శరద్ పవార్ ఒకే వేదికను పంచుకున్న సంగతి విధితమే.

ఎంతో సీనియర్ అయిన పవార్ ప్రధాని ఏనాడో కావాల్సిదని కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాల మూలంగానే ఆయన కాలేకపోయారని ప్రధాని నాడు వ్యాఖ్యానించిన సంగతిని కూడా ప్రచారంలో ఉంచారు. ఇదంతా పవార్ ని దువ్వే ప్రయత్నం అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇదిలా ఉంటే శరద్ పవార్ తో బీజేపీ పంచన చేరిన ఆయన మేనల్లుడు అజిత్ ఇటీవల ఒక రహస్య సమావేశాన్ని నిర్వహించారు. పుణేలోని ఓ డెవలపర్ నివాసంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా శరద్ పవార్ ని కూడా బీజేపీ వైపు గా తీసుకుని వచ్చేందుకు ఒక బ్రహ్మాండమైన ప్లాన్ ని కాషాయ పెద్దలు వేసి దాన్ని అజిత్ పవార్ ద్వారా అమలులో పెట్టారని అంటున్నారు.

శరద్ పవార్ కి కేంద్రంలో కీలకమైన వ్యవసాయ మంత్రి పదవిని ఆయన కుమార్తె సుప్రియా సూలే కి కేంద్ర మంత్రిగా ఇంకో పదవి ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించిందని అంటున్నారు. ఆ సందేశాన్ని అజిత్ పవార్ శరద్ పవార్ కి మోసుకొచ్చారని అంటున్నారు. వచ్చే ఎన్నికలు బీజేపీకి చాలా ముఖ్యం. దేశంలో ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర ఒకటి.

అక్కడ 48 సీట్లు ఉన్నాయి. దాంతో శరద్ పవార్ ఎన్సీపీని తమ వైపు తిప్పుకుంటే ఈసారి కచ్చితంగా 40 సీట్లకు తక్కువ లేకుండా గెలుచుకోవచ్చు అన్నది బీజేపీ ప్లాన్. పెద్దాయనను అలా తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ చూస్తోంది. అయితే దీని మీద శరద్ పవార్ ఏమన్నారో తెలియదు కానీ ఈ రహస్య భేటీ మాత్రం మహారాష్ట్రలోని మహా వికాస్ అగాఢీ కూటమిలో చిచ్చు రేపుతోంది.

దీని వల్ల కూటమికే ఎసరు వస్తుందని విపక్ష నేతలు అంటున్నారు. అయితే ఈ భేటీ మీద శరద్ పవర్ స్పందిస్తూ తన సొంత మేనల్లుడితో భేటీ కూడా విశేషమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇది రాజకీయాలకు సంబంధం లేని విషయం అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్సీపీని బీజేపీకి దగ్గర చేయనీయమని కూడా ఆయన ఒట్టేసి చెబుతున్నారు. ఇదే మాటను ఆయన కుమార్తె సుప్రియా సూలే కూడా చెబుతున్నారు.

కానీ ఈ రహస్య భేటీ మీద అటు మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు అయితే శరద్ పవార్ మీద మండిపోతున్నారు. పవార్ ఈ భేటీ విషయంలో ఎన్ని చెప్పినా తాము మాత్రం రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. ఎన్సీపీ లేకపోయినా కూడా వచ్చే ఎన్నికల్లఒ ఎదుర్కోవడానికి మహా వికాస్ అగాఢీ కూటమి సిద్ధంగా ఉంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే శివసేన కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతోంది. ఈ భేటీ మంచిది కాదని అంటోంది. దీనిని తాము తప్పు పడతామని అంటోంది. ఇదిలా ఉంటే ఇండియా కూటమి నుంచి శరద్ పవార్ దూరంగా జరిగితే మాత్రం భారీ బీటలు పడతాయని అంటున్నారు.

అయితే 83 ఏళ్ళు పై దాటిన శరద్ పవార్ ని ఇండియా కూటమికి ప్రదానిగా ప్రకటించడంలేదన్న అసంతృప్తి అయితే ఎన్సీపీ నేతలలో ఉంది అని అంటున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని పదవి మీద కన్నేశారు అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ సైతం శరద్ పవార్ వైపు చూడడంలేదని అంటున్నారు. దాంతో ఎన్సీపీని చీలికను అరికట్టడానికి తన కుమార్తె మనవడు భవిష్యత్తుని చూసుకోవడానికైనా శరద్ పవార్ బీజేపీతో చేతులు కలుపుతారా అన్న సందేహాలు అయితే ఏర్పడుతున్నాయి.

ఇంకో వైపు చూస్తే ఇండియా కూటమిలో ఉన్నా కూడా ఆప్ కి కాంగ్రెస్ కి మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ పాలన బాగా లేదని ఢిల్లీ కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ ఘాటు విమర్శలు చేశారు. కేంద్రం ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ ని చట్టం చేయడం మంచిది అని కాంగ్రెస్ నేత మాట్లాడడంతో ఆప్ ఫైర్ అవుతోంది. మొత్తానికి చూస్తే ఇండియా కూటమిలో విభేదాలు పెరిగి పెద్దవి అవుతున్నాయి. దానిని ఇంకా పెంచేందుకు బీజేపీ చేయని ప్రయత్నం లేదు అంటున్నారు.