Begin typing your search above and press return to search.

పవార్లు ఇద్దరూ కలిశారు.... ఎవరి పవర్ కి ఎసరు ...?

ఎన్సీపీ నేత శరద్ పవార్ తో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శనివారం రహస్యంగా మీట్ అయ్యారన్న వార్త గుప్పుమంటోంది

By:  Tupaki Desk   |   13 Aug 2023 4:00 AM GMT
పవార్లు ఇద్దరూ కలిశారు.... ఎవరి పవర్ కి ఎసరు ...?
X

ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ తో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శనివారం రహస్యంగా మీట్ అయ్యారన్న వార్త మహా రాజకీయాల్లో గుప్పుమంటోంది. ఈ ఇద్దరూ పవార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన పుణెలోని కొరేగావ్ పార్క్‌లో ఉన్న వ్యాపారవేత్త అతుల్ చోరడియా నివాసంలో ఈ రహస్య భేటీ జరిపారు.

ఈ ఇద్దరూ ఏమి మాట్లాడుకున్నారు అన్నది వెల్లడి కావడంలేదు కానీ మహారాష్ట్ర రాజకీయాలలో కొత్త మలుపు ఏదో ఉందని ఈ భేటీని బట్టి అర్ధం చేసుకోవాలని అంటున్నారు. ఇదిలా ఉంటే శరద్ పవార్ తో విభేదించి ఆయన సొంత మేనల్లుడు అజిత్ పవార్ జూలై 2న మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంలో చేరిపోయారు. తనతో పాటు మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలకు ఆయన మంత్రి పదవులు కూడా ఇప్పించుకున్నారు.

అసలైన ఎన్సీపీ తనదే అని ఆ తరువాత ఆయన ఘాటు వ్యాఖ్యలే చేసారు. శరద్ పవార్ వృద్ధ నాయకుడు అయిపోయారని ఇక ఆయన చేతిలో నుంచి ఎన్సీపీని తానే తీసుకుంటానని కూడా కీలక ప్రకటనలు చేసారు. ఇవన్నీ పక్కన పెడితే ఆ తరువాత కూడా ఒకసారి శరద్ పవార్ తో అజిత్ పవార్ భేటీ అయి ఆయనను తమ వైపుగా వచ్చేందుకు ఒప్పించే ప్రయత్నం చేశారు.

కానీ శరద్ పవార్ మాత్రం ఎన్సీపీని ఇంకా బలోపేతం చేస్తామని, తమ పార్టీ ఒడుదుడుకు ఎదుర్కోవడం ఇది మొదటి సారి కాదని నిబ్బరం కనబరచారు. ఇదిలా ఉంటే అతి తొందరలోనే అజిత్ పవార్ మహారాష్ట్రకు సీఎం అవుతారు అని కూడా ఆయన వర్గం ప్రచారం చేయడం మొదలెట్టింది. మరో వైపు శివసేనను చీల్చి గత ఏడాది బీజేపీ మద్దతుతో సీఎం అయిన ఏక్ నాధ్ షిండేను పక్కన పెట్టి అజిత్ పవార్ ని బీజేపీయే సీఎంగా చెస్తుందని కూడా ప్రచారంలో ఉంది.

ఈ నేపధ్యంలో సొంత మేనమామ అయిన శరద్ పవార్ తో అజిత్ పవార్ ఏమి మాట్లాడి ఉంటారు అన్నది చర్చగా ముందుకు వస్తోంది. ఈ ఇద్దరు పవార్లు కలిస్తే ఎవరి పవర్ కి ఎసరు వస్తుంది అన్నది కూడా మహా పాలిటిక్స్ లో సీరియస్ ఇష్యూగా ఉందిట. ఏది ఏమైనా ఈ ఇద్దరూ ఒకరికి ఒకరు తీసిపోని రాజకీయ చాణక్యులే. ఇద్దరూ కలసి పార్టీని ఏళ్లకు ఏళ్ళు నడిపించారు.

మేనల్లుడి పాచికలు పావులు ఆయన బీజేపీతో చేతులు కలపడం ఇవన్నీ శరద్ పవార్ కి తెలిసి జరిగాయా లేక జరిగిన తరువాత ఆయన వ్యూహాలను కొత్తగా ఏమైనా అమలు చేస్తున్నారా అన్నది తెలియదు కానీ ఈ సీక్రేట్ మీటింగ్ మహా రాజకీయంలో ఏమైనా సునామీని సృష్టిస్తుందా అన్నదే చర్చగా ఉంది మరి.