షాకింగ్: ప్రపంచ ప్రఖ్యాత షావోలిన్ టెంపుల్ అధినేత తప్పుడు పనులు
షావోలిన్ టెంపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘‘మార్షల్ ఆర్ట్స్’’ అన్న మాట తెలిసిన ప్రతి ఒక్కరికి షావోలిన్ టెంపుల్ గురించి తెలిసి ఉండటమే కాదు..
By: Tupaki Desk | 28 July 2025 6:00 PM ISTషావోలిన్ టెంపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘‘మార్షల్ ఆర్ట్స్’’ అన్న మాట తెలిసిన ప్రతి ఒక్కరికి షావోలిన్ టెంపుల్ గురించి తెలిసి ఉండటమే కాదు.. తమ జీవితకాలంలో ఒక్కసారైనా అక్కడకు వెళ్లాలని అనుకోవటం కనిపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత మార్షల్ ఆర్ట్స్ లో ఒకటైన కుంగ్ ఫూ కు పుట్టినిల్లుగా.. దాని శిక్షణకు అంతకు మించిన ప్రదేశం మరొకటి లేదన్న పేరు ప్రఖ్యాతులు షావోలిన్ సొంతం.
చైనాలోని హెనాన్ ఫ్రావిన్సులో ఉండే షావోలిన్ టెంపుల్ ను క్రీస్తు శకం 495లో స్థాపించారు. సాంగ్ పర్వత దిగువన ఈ ప్రసిద్ధ క్షేత్రం ఉంది. 1500 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టెంపుల్ కు చారిత్రక ప్రాధాన్యత మాత్రమే కాదు.. అంతకు మించిన మతపరమైన ప్రాముఖ్యత ఉంది. మార్షల్ ఆర్ట్స్ కు ఎంతో ఫేమస్ అయిన ఈ టెంపుల్ కు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి కుంగ్ ఫూ శిక్షణ తీసుకుంటూ ఉంటారు. పర్యాటకంగానూ ఎంతో ప్రాచుర్యం పొందిన షావోలిన్ టెంపుల్ కు అధినేతగా ఉండే గురువు తప్పుడు పనులు తాజాగా తెర మీదకు వచ్చి సంచలనంగా మారాయి.
షావోలిన్ టెంపుల్ కు అధిపతిగా వ్యవహరిస్తున్న షి యోంగ్సిన్ వ్యవహరశైలిపై పలు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాలా రోజులుగా అనేక మంది మహిళలతో లైంగిక సంబంధాలు మాత్రమే కాదు.. అక్రమంగా ఒక చిన్నారికి తండ్రి అయినట్లుగా గుర్తించిన వైనం కలకలాన్ని రేపుతోంది. అతడు చేసిన పనులన్నీ బౌద్ధ సూత్రాల్ని ఉల్లంఘించినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అతడ్ని పలు విభాగాల అధికారులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని త్వరలో షేర్ చేస్తామని చెబుతున్నారు. నిధుల దుర్వినియోగంతో పాటు.. అక్రమంగా ఆస్తుల్ని కూడబెట్టటం.. పలువురు మహిళలతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్న వైనం తీవ్ర కలకలానికి కారణంగా మారింది. చైనాలోని ప్రసిద్ధ బౌద్ధ సన్యాసుల్లో ఒకరుగా గుర్తింపు పొందిన ఇతగాడి మీద గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నట్లుగా చెబుతున్నారు
1999లో సావోలిన్ టెంపుల్ కు అధిపతిగా నియమితులైన అతడు.. ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయటంతో అతడ్ని సీఈవో మాంక్ గా పేర్కొనేవారు. ఎంబీఏ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అతను.. ఆస్ట్రేలియాలో కోట్లాది రూపాయిలు విలువ చేసే ఆలయాన్ని.. ఒక హోటల్ ను.. కుంగ్ ఫూ అకాడమీతో పాటు.. గోల్ఫ్ కోర్స్ నిర్మించాలన్న ప్రణాళిక వివాదాస్పదంగా మారిన వైనం తెలిసిందే. ఎంతో గౌరవ స్థానంలో ఉన్న బౌద్ధ గురువు ఇలాంటి తప్పుడు పనులు చేయటం.. అవన్నీ బయటకు రావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
