Begin typing your search above and press return to search.

శంషాబాద్ - విశాఖ కేవలం 4.30 గంటల్లోనే అదెలానంటే?

ఇప్పుడు ప్లానింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు పట్టాల మీదకు వచ్చే సమయానికి ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   3 Feb 2024 5:35 AM GMT
శంషాబాద్ - విశాఖ కేవలం 4.30 గంటల్లోనే అదెలానంటే?
X

హైదరాబాద్ మహానగరంలో ధియేటక్ కు ఒక సినిమాకు వెళ్లి.. మళ్లీ ఇంటికి తిరిగి వచ్చే సమయానికి శంషాబాద్ నుంచి విశాఖపట్నానికి చేరుకునేలా ఒక ప్రాజెక్టును డిజైన్ చేశారు. గంటకు 220 కి.మీ. వేగంతో పరుగులు తీసే ఈ హైస్పీడ్ ట్రైన్ అందుబాటులోకి వస్తే ఇప్పుడు 10-11 గంటల జర్నీ తీసుకుంటున్న స్థానే కేవలం 4.30 గంటల వ్యవధిలోనే హైదరాబాద్ ఎయిర్ పోర్టు శంషాబాద్ నుంచి విశాఖకు చేరుకునే వీలుంటుంది.

అయితే.. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.20వేల కోట్లకు పైనే అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ప్లానింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు పట్టాల మీదకు వచ్చే సమయానికి ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వచ్చే మార్చికి పెట్ (ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్)సర్వే పూర్తి కానుంది. దీని తర్వాత సమగ్ర సర్వే (డీపీఆర్) కోసం కన్సెల్టెన్సీ ఏర్పాటు చేయనున్నారు. సర్వేలో భాగంగా ఎంపిక చేసిన రూట్ లో ఇంజనీరింగ్ అంశాలపై అధ్యయనం చేశారు.

ఎక్కడెక్కడ వంతెనలు.. ఇతర నిర్మాణాలు చేపట్టాలన్న అంశాలను పరిశీలించారు. రెండు మార్గాల్లో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల రద్దీతోపాటు.. ఫ్యూచర్ లో వచ్చే హైస్పీడ్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ.. డిమాండ్ ఎలా ఉంటుందన్న అంశాలపైనా పెట్ సర్వే నివేదికలో వివరంగా ప్రస్తావించనున్నారు. డీపీఆర్ సర్వేకు మరో 6-8 నెలల సమయం పడుతుందన్నది అధికారుల అంచనా. ఇప్పుడున్న పరిస్థితుల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి 12-13 గంటల సమయం పట్టనుంది. హైదరాబాద్ మహానగరం నుంచి విశాఖకు రోజువారీగా 10 రెగ్యులర్ రైళ్లతో పాటు.. 12 వీక్లీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 25వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు. మరో 30వేల మంది వీక్లీ ట్రైన్లలో రాకపోకలు సాగిస్తున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సైతం రాకపోకలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రతిరోజు సుమారు 55వేల మంది ప్రయాణికులు ఉంటున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులు 10వేల మంది వరకు ప్రయాణిస్తున్నారు. హైస్పీడ్ రైలుతో విశాఖ నుంచి అమెరికాకు.. దుబాయ్.. యూరోప్ తదితర దేశాలకు రాకపోకలు సాగించే వారికి శంషాబాద్ ఎయిర్ పోర్టు అనువుగా మారనుంది. రెండు వైపులా ప్రయాణాలు చేసే వారు.. విమాన ప్రయాణికుల అవసరాలు తీరేందుకు వీలుగా ఈ ప్రాజెక్టు ఉంటుందని చెబుతున్నారు.

అనుకున్నది అనుకున్నట్లుగా పనులు సాగితే.. ఐదారేళ్లలోనే తెలుగు రాష్ట్రాలకు హైస్పీడ్ రైలు అందుబాటులోకి రానుంది. వేగవంతమైన హైస్పీడ్ రైల్ కు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే బాగుంటుందన్నది ఇంజనీరింగ్ వర్గాల అభిప్రాయం. అయితే.. నేల మీద హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తే నిర్మాణ వ్యయం తగ్గుతుంది. అదే సమయంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే మాత్రం ఇప్పుడు అనుకుంటున్న అంచనాలకు రెట్టింపు వ్యయం అయ్యే వీలుంది. అందుకే.. ఈ రెండింటిలో ఏ పద్దతికి ఎంపిక చేయాలన్నది డీపీఆర్ తర్వాత డిసైడ్ చేయటం మంచిదంటున్నారు.