Begin typing your search above and press return to search.

సరికొత్త రికార్డ్ సృష్టించిన శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు... ర్యాంక్ మారింది!

శంషాబాద్‌ విమానాశ్రయం తనదైన దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా విదేశాలకు వెళ్లేవారు.. అక్కడ నుంచి వచ్చే వారి అతిథుల విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

By:  Tupaki Desk   |   1 Sep 2023 8:56 AM GMT
సరికొత్త రికార్డ్ సృష్టించిన శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు... ర్యాంక్ మారింది!
X

శంషాబాద్‌ విమానాశ్రయం తనదైన దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా విదేశాలకు వెళ్లేవారు.. అక్కడ నుంచి వచ్చే వారి అతిథుల విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన తాజా వివరాలను ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.

అవును... శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్యతోపాటు విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరగుతోందిని చెబుతుంది ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీంతో ఈ ఎయిర్‌ పోర్టులో రాకపోకలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ ఘణాంకాల ప్రకారం ప్రస్తుతం నెలకు 20 లక్షల మంది అంతర్జాతీయ, దేశీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.

ఈ క్రమంలో... జులై నెలలో అయితే 3.68 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ ఎయిర్‌ పోర్టు సేవలందించగా... సుమారు 17లక్షల మంది దేశీయ ప్రయాణికులకు సేవలందించిందని ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారికంగా ప్రకటించింది.

దీంతో... దేశంలోనే అత్యధిక విమాన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ లో శంషాబాద్‌ నాలుగో స్థానంలో ఉంది. గతంలో శంషాబాద్ కంటే ముందున్న చెన్నై, కోల్‌ కతా అంతర్జాతీయ విమానాశ్రయాలను ఈసారి వెనక్కి నెట్టి ఈ ఘనతను సాధించింది.

శంషాబాద్‌ విమానాశ్రయం ఏర్పాటైన అయిదున్నరేళ్లకే రద్దీ విపరీతంగా పెరగడం, పదిహేనేళ్లకు దాదాపు రెట్టింపు ప్రయాణికులు రాకపోకలు కొనసాగించింది. ఈ క్రమంలో ప్రతీ ఏటా సుమారు 3.4 కోట్ల మంది రాకపోకలకు అనుగుణంగా విస్తరిస్తున్నారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందినవారు కూడా విదేశాలకు వెళ్లేందుకు శంషాబాద్‌ విమానాశ్రయాన్ని ఎంచుకుంటున్నారని తెలుస్తుంది.

గతంలో కరోనా సమయంలో రాకపోకలు బంద్‌ అవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు కానీ... కరోనా తర్వాత మాత్రం శంషాబాద్‌ నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు క్రమంగా పెరిగాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 80కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి.

కాగా... దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరును ఈ విమానాశ్రయాన్ని 2008 లో ప్రారంభించారు. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత.. పబ్లిక్ - ప్రైవేట్ ఉమ్మడి నిర్వహణలో నడుపబడుతున్న రెండో విమానాశ్రయం ఇదే. ఇందులో జీఎంఆర్ గ్రూపు, మలేసియా ఎయిర్ పోర్ట్స్ వంటి ప్రైవేట్ యాజమాన్యాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం, ఎయిర్‌ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి పబ్లిక్ సంస్థలతో ఈ విమానాశ్రయం సంయుక్తంగా నడుస్తోంది.