Begin typing your search above and press return to search.

దూసుకెళుతున్న శంషాబాద్ ఎయిర్ పోర్టు

అంతర్జాతీయ విమాన ప్రయాణికుల రాకపోకల విషయంలో టాప్ 4కు శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్నట్లుగా తేల్చారు

By:  Tupaki Desk   |   19 Oct 2023 4:26 AM GMT
దూసుకెళుతున్న శంషాబాద్ ఎయిర్ పోర్టు
X

మరోసారి వార్తల్లోకి వచ్చింది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. దేశంలోనే పేరున్న ఎయిర్ పోర్టుల్లో ఒకటిగా నిలిచిన ఎయిర్ పోర్టు.. ఇటీవల కాలంలో పలు రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది.తాజాగా అంతర్జాతీయ విమానయాన ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త స్థాయికి చేరుకుంది. దేశంలోనే విదేశీ ప్రయాణాల విషయంలో దేశంలో ఇప్పటివరకు అగ్రస్థానాల్లో ఉన్న ఎయిర్ పోర్టులను దాటేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.

అంతర్జాతీయ విమాన ప్రయాణికుల రాకపోకల విషయంలో టాప్ 4కు శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్నట్లుగా తేల్చారు. ఆగస్టులో 3.39 లక్షల మంది ప్రయాణికులు అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ప్రయాణించగా.. 16.97 లక్షల మంది దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణించినట్లుగా ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. ఆగస్టులో 20.36 లక్షల మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా ప్రయాణించిన వైనం ఆసక్తికరంగా మారింది.

తాజా రద్దీతో దేశంలోని ఇతర మెట్రో నగరాలైన చెన్నై.. కోల్ కతాలను హైదరాబాద్ ఎయిర్ పోర్టు దాటేయటం గమనార్హం. దుబాయ్.. అమెరికా.. ఐరోపా దేశాలకు వెళ్లే ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి పెద్ద ఎత్తున సర్వీసులు లభ్యమవుతున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు.. ఏపీ.. మహారాష్ట్ర.. కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారికి అనువుగా ఉండటం లాభిస్తోంది.

ఐటీ రంగం అంతకంతకూ ముందుకు వెళ్లటం.. హైదరాబాద్ వేదికగా సదస్సులు.. అంతర్జాతీయ సమావేశాలు తరచూ చోటు చేసుకోవటం కూడా ప్రయాణికుల రద్దీకి కారణంగా చెబుతున్నారు. దీనికి తోడు విదేశీ విద్యకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వెళుతున్న నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇది కూడా పెద్ద ఎత్తున రాకపోకలకు కారణమవుతుందని చెబుతున్నారు.