మహారాష్ట్రను కుదిపేస్తున్న రూ.3 వేల కోట్ల ’టీచర్ల’ కుంభకోణం..
షలార్త్.. మహారాష్ట్ర విద్యా శాఖ పోర్టల్ ఇది. కొందరు సీనియర్ విద్యాధికారులు దీనిని దుర్వినియోగం చేశారు.
By: Tupaki Desk | 21 July 2025 4:01 PM ISTఆ మధ్య మధ్యప్రదేశ్ లో వ్యాపమ్ స్కామ్ అని చోటుచేసుకుంది. రూ.వందల కోట్ల ఈ కుంభకోణం దేశాన్ని కూడా కదిలించింది.. తీవ్ర సంచలనంగా మారింది. ఏవో కొన్ని కుంభకోణాలు తప్ప మిగతావి జాతీయ స్థాయిలోకి రావు. ఇప్పుడు అలాంటిదే ఓ స్కాం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. పైగా అందులో ప్రధాన భాగస్వాములు ఎవరో కాదు.. ఉపాధ్యాయులే భాగస్వాములు కావడం గమనార్హం.
షలార్త్.. మహారాష్ట్ర విద్యా శాఖ పోర్టల్ ఇది. కొందరు సీనియర్ విద్యాధికారులు దీనిని దుర్వినియోగం చేశారు. నకిలీ టీచర్ ఐడీలను రూపొందించి.. అర్హులు కాని వ్యక్తులను టీచర్లుగా నియమించినట్లు బయటపడింది. స్కాం విలువ ఏకంగా రూ.3 వేల కోట్లకు పైనే అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు టీమ్ ను ఏర్పాటు చేసింది.
కాగా, కుంభకోణంలో పాత్ర ఉందని అనుమానిస్తున్న పలువురిని ఇప్పటికే అరెస్టు చేశారు. మరికొందరని సస్పెండ్ చేశారు. గమనార్హం ఏమంటే.. మహారాష్ట్రలో కీలకమైన ముంబై, నాగ్ పూర్ జోన్ల విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్లు నకిలీ ఐడీలను పుట్టించారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఒక పాఠశాలలో టీచర్ ఖాళీ ఏర్పడినప్పుడు.. వేరొకరి నియామకం కోసం అభ్యర్థిని ఎంపిక చేసి సంబంధిత పాఠశాల అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇస్తుంది. అభ్యర్థి ఈ ఆర్డర్ తో జోన్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వద్దకు వెళ్తే ఆమోదించి.. షలార్త్ ఐడీ, పాస్ వర్డ్ అందిస్తారు. అనంతరం మాత్రమే వారికి జీతంతో పాటు ఇతర ప్రయోజనాలు దక్కుతాయి. షలార్త్ అనేది మహారాష్ట్ర విద్యాశాఖ సిబ్బంది సమగ్ర సమాచారం ఉండే పోర్టల్. వీటికి సంబంధించి ఐడీ, పాస్ వర్డ్ జారీ అధికారం విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ కు ఉంటుంది. ఆ కార్యాలయాల్లోని అధికారులు బోగస్ ఐడీలతో వేతనాలను స్వాహా చేయడం.. వాటి విలువ రూ.3 వేల కోట్లు కావడమే ఇక్కడ సంచలనం రేపుతోంది.
నకిలీ ఆధారాలు, దొంగ బ్యాంకు ఖాతాలు, టీచర్లు, హెచ్ఎంలుగా అనర్హులను నియమించి వారి నుంచి భారీఎత్తున లంచాలు పొందారనే ఆరోపణలున్నాయి. కాగా, ఇదంతా ఎయిడెడ్ పాఠశాలల్లో జరిగిన కుంభకోణం. వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలా జరిగిందనే విమర్శలు వస్తున్నాయి.
