అమ్మాయిలపై సినిమాల ప్రభావం... మహిళా కమిషన్ కీలక వ్యాఖ్యలు!
ఈ సమయంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 24 July 2025 8:45 AM ISTఇటీవల కాలంలో మహిళలు, ఆడపిల్లల భద్రతపై ప్రభుత్వాలు కీలక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పలు రకాల ప్రత్యేక యాప్ లు తీసుకొస్తూ.. వారి రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ సమయంలో ప్రతీ మహిళ, ప్రతీ యువతి తమ తమ ఫోన్ లలో ఈ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాలని చెబుతున్నారు. ఈ సమయంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... బుధవారం అనంతపురంలోని ఎస్.ఎస్.బి.ఎన్. డిగ్రీ కళాశాలలో జిల్లా మహిళా శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "మహిళల సంక్షేమం, భద్రత మరియు సాధికారత"పై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పందించిన ఆమె... ముఖ్యంగా ఏపీలో ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా... సమాజంలోని ప్రతి ఒక్కరికి మహిళల చట్టాలపై సంపూర్ణ అవగాహన ఉండాలని.. స్కూళ్లు, కాలేజీలలోని విద్యార్థినీలు ఇప్పటినుంచే ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక చట్టాలతో పాటు మహిళల రక్షణ, భద్రత, సాధికారతలపై చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని అన్నరు. కేవలం ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడే కాకుండా.. ముందస్తుగా వాటిని నివారించడానికి చర్యలు తీసుకోవడం ముఖ్యమని తెలిపారు.
ఇదే సమయంలో... ప్రతి అమ్మాయి, మహిళ వారి మొబైల్ లో ‘శక్తి’ యాప్ ను తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా... సినిమాల ప్రభావం కూడా నేటి అమ్మాయిలపై ఎంతగానో ఉందని చెప్పిన ఏపీ స్టేట్ మహిళా కమిషన్ చైర్ పర్సన్... ఆ ప్రభావాన్ని దూరం చేయాలనే సంకల్పంతోనే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న పరిచయాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు!
ప్రధానంగా.. అమ్మాయిలు చదువుపై దృష్టి పెట్టాలని, పెద్దల సూచనలు పాటించాలని సూచించిన డాక్టర్ రాయపాటి శైలజ... తొందరపాటు నిర్ణయాలు తీసుకొని, భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకోవద్దని సూచించారు. ఉద్యోగులు పని చేస్తున్న ప్రాంతాల్లో, పాఠశాల, కళాశాలలలో అంతర్గత సెక్సువల్ హెరాస్మెంట్ ప్రివెన్షన్ కమిటీలు ఏర్పాటు కావాలని, సదరు అంశాలపై సంబంధిత అధికారులు వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
