Begin typing your search above and press return to search.

షారూక్ ఇడ్లీ వడ వివాదం.. అట్లీ స్టాండ్ ఏంటి?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు

By:  Tupaki Desk   |   6 March 2024 11:03 AM GMT
షారూక్ ఇడ్లీ వడ వివాదం.. అట్లీ స్టాండ్ ఏంటి?
X

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ ఇండియాలోనే కాదు, సౌత్ లోనూ కింగ్ ఖాన్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. దక్షిణాది సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ఆయనకు మంచి వాల్యూ ఇస్తారు. ఆయన సినిమాలను విశేషంగా ఆదరిస్తారు.. సౌత్ స్టేట్స్ కు వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానిస్తారు. అయితే సౌత్ ఇండియన్ స్టార్ హీరో రామ్ చరణ్ ను ఉద్దేశిస్తూ 'ఇడ్లీ.. వడ' అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు షారుక్ ను వివాదంలోకి లాగాయి. ఇన్నాళ్లూ మెచ్చుకున్న వారే ఆయన్ను దారుణంగా తిట్టిపోసే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఈ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సౌత్ స్టార్స్ ను అగౌరవపరిచే బాలీవుడ్ ధోరణి గురించే ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి.

గుజరాత్ వేదికగా జరిగిన అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు బాలీవుడ్ స్టార్స్ అందరూ పాల్గొన్న ఈ వేడుకలో, సౌత్ నుంచి చరణ్ దంపతులతో పాటుగా సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ అట్లీలు తమ ఫ్యామిలీలతో కలిసి సందడి చేసారు. ఖాన్ త్రయం షారుక్, సల్మాన్, ఆమీర్ లు ఒకే వేదికపై 'నాటు నాటు' పాటకు హుక్ స్టెప్ ట్రై చెయ్యడం హైలైట్ గా నిలిచింది. RRR స్టార్ చరణ్ కూడా అక్కడే ఉండడంతో తనను కూడా స్టేజ్‌ పైకి పిలవలనుకున్నారు. మాములుగా పిలిస్తే ఎలాంటి గొడవా ఉండేది కాదు. కానీ షారుక్ మాత్రం నోటికొచ్చిన తమిళ పదాల్లో ఏదేదో మాట్లాడుతూ.. ''ఇడ్లీ వడ రామ్ చరణ్ కహా హై తూ?'' అంటూ పిలిచారు. దీనిపైనే ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన సినిమాలో భాగమైన స్టార్ హీరోని 'ఇడ్లీ వడ' అని సంబోధించడం ఏంటని షారుక్ ఖాన్ పై టాలీవుడ్ ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. ఇది రామ్ చరణ్ తో పాటుగా యావత్ సౌత్ హీరోలందరినీ అగౌరవ పరచడమే అవుతుందని అభిప్రాయపడుతున్నారు. దక్షిణాది ప్రజలు ఎంతో ఇష్టపడే ఆహారాన్ని ఇలా చులకన చేసి మాట్లాడటం, సౌత్ హీరోని చిన్నచూపు చూడటం అతని అహంకారానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ పై సౌత్ ఇండస్ట్రీ పైచేయి సాధించడాన్ని హిందీ స్టార్స్ తట్టుకోలేకపోతున్నారని.. ఈర్ష్యతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే ఈ వివాదంపై డైరెక్టర్ అట్లీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ గతేడాది షారుక్ ఖాన్ కు 'జవాన్' వంటి కమర్షియల్ సక్సెస్ అందించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు 1200 కోట్ల వసూళ్లు రాబట్టి, షారుక్ కెరీర్ లోనే కాదు.. హిందీ చిత్ర పరిశ్రమలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మళ్ళీ కింగ్ ఖాన్ ను టాప్ లోకి తీసుకొచ్చింది. సౌత్ ఫిలిం మేకర్ అలాంటి మరపురాని సినిమాని అందించి కెరీర్ ను ట్రాక్ లో పెడితే, షారుక్ మాత్రం దక్షిణాది హీరోలని 'ఇడ్లీ వడ' అంటూ చులకనగా తీసి పారేసాడు. అందులోనూ ఈ కామెంట్స్ చేస్తున్నప్పుడు అట్లీ కూడా అదే వేడుకలో ఉన్నారు. షారుఖ్ కావాలని అలా మాట్లాడాడో, అనుకోకుండా అలా అన్నాడో తెలియదు కానీ.. ఇది కచ్చితంగా సౌత్ ను తక్కువ చేసినట్లే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అట్లీ కూడా కాస్త హర్ట్ అయ్యాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటికైతే షారుక్ ఖాన్ తన వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. స్టేజ్ మీద డిగ్నిటీగా వ్యవహరించిన రామ్ చరణ్ సైడ్ నుంచి కూడా స్పందన లేదు. కానీ ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ మాత్రం ఈ ఘటనతో తాను అప్సెట్ అయ్యానంటూ పోస్టు పెట్టింది. చరణ్ పట్ల ఇంత అగౌరవంగా వ్యవహరించడం చూసి తాను అంబానీల ఈవెంట్ నుంచి వాకౌట్ చేశానని చెప్పింది. తన ఇడ్లీ వడ కామెంట్స్ పై షారుక్ క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియాలో డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వివాదానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.