భారత్ లో అమెరికా రాయబారిగా ట్రంప్ జేబు మనిషి.. వయసు 38 ఏళ్లే
ఇక నేరుగా అమెరికా అధ్యక్షుడికి సన్నిహిత వ్యక్తి రాయబారి అయితే.. అది కూడా భారత్ వంటి దేశంలో అయితే ఇక చెప్పేది ఏముంది...? ఇప్పుడు ఇదే జరిగింది
By: Tupaki Desk | 23 Aug 2025 2:02 PM ISTఒక విదేశంలో అమెరికా రాయబారి అంటే మామూలు మాటలు కాదు. ఇక నేరుగా అమెరికా అధ్యక్షుడికి సన్నిహిత వ్యక్తి రాయబారి అయితే.. అది కూడా భారత్ వంటి దేశంలో అయితే ఇక చెప్పేది ఏముంది...? ఇప్పుడు ఇదే జరిగింది. భారత్ లో అమెరికా రాయబారిగా ఓ యువకుడిని నియమించారు. అతడి వయసు 38 ఏళ్లే. కానీ, చరిత్ర మాత్రం చాలా ఉంది.
సుంకాల వేళ.. చమురు సెగల్లో
డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా విధిస్తున్న టారిఫ్ లతో అమెరికా-భారత్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. 50 శాతం సుంకాలతో భారత్ నుంచి తీవ్ర స్పందన వస్తోంది. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా అభ్యంతరాలను భారత్ లెక్కచేయడం లేదు. ఇలాంటి సమయంలో భారత్ లో అమెరికా రాయబారి పాత్ర కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే సెర్గియో గోర్ ను ఆ పదవిలో నియమించారు.
గోర్ చిన్నవాడే కాదు..
సెర్గియో గోర్ వయసు 38 మాత్రమే. అంటే ట్రంప్ వయసులో సగం కూడా కాదు. కానీ, అతడి చరిత్ర మాత్రం చాలా పెద్దది. ట్రంప్ నకు వీర విధేయుడైన గోర్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి భవనం వైట్ హౌస్ లో పర్సనల్ డైరెక్టర్. ఈయన నియామకాన్ని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారంటేనే గోర్ స్థాయి ఏమిటో తెలుస్తోంది. పైగా భారత్ లో రాయబారితో పాటు దక్షిణ, మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగానూ గోర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
4 వేల మంది అమెరికా ప్రేమికులను తయారు చేశారట...
గోర్ టీమ్ లో 4 వేల మంది అమెరికాపై ప్రేమ కలిగిన వారు ఉన్నారట. వీరందరినీ అతడే ఎంపిక చేశాడట. ఫెడరల్ ప్రభుత్వం శాఖలు, ఏజెన్సీల్లో 95 శాతం ఉద్యోగాల్లో వీరిని నియమించారట. తాను అధ్యక్షుడిగా గెలవడంలో సెర్గియో పాత్ర చాలా ఉందని ట్రంప్ స్వయంగా చెప్పారు. ట్రంప్ నకు చెందిన బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ను పబ్లిష్ చేసింది ఆయనేనని తెలిపారు. అతిపెద్ద జనాభా కలిగిన ఆసియా ప్రాంతంలో తన ఎజెండా అమలుకు వెళ్తున్న తన విశ్వాసపాత్రుడికి ఆల్ ది బెస్ట్ చెప్పారు ట్రంప్.
