Begin typing your search above and press return to search.

ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు.. సరోగసీ ఇండస్ట్రీ మనకొద్దు

సరగోసీ చట్టంలోని రూల్ 7 ప్రకారం ఫారం 2ను మార్చటం ద్వారా సరోగసీ చట్టాన్ని సవరించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Dec 2023 4:21 AM GMT
ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు.. సరోగసీ ఇండస్ట్రీ మనకొద్దు
X

తరచూ చర్చకు వచ్చే సరగోసీ విధానానికి సంబంధించి.. ఆ రంగానికి సంబంధించిన అంశాలపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. దేశంలో ఈ రంగాన్ని ప్రోత్సహించొద్దని పేర్కొంది. సరగోసీ చట్టంలోని రూల్ 7 ప్రకారం ఫారం 2ను మార్చటం ద్వారా సరోగసీ చట్టాన్ని సవరించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం ఈ మారచిలో జారీ చేసింది.

దీనిపై భారత సంతతికి చెందిన దంపతులు సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. సరోగసీ ఇండస్ట్రీని ప్రోత్సహించొద్దని పేర్కొంది. సరోగసీ నిబంధనల్లోని మార్పులు కోర్టుల కారణంగానే జరిగాయని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. ఈ పరిశ్రమను ప్రోత్సహించొద్దని హితవు పలికింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్..జస్టిస్ మినీ పుష్కర్ లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది.

భారతదేశంలో సరోగసీ చట్ట సవరణను సవాలు చేస్తూ కెనడాలో ఉంటున్న భారత సంతతి దంపతులు పిటిషన్ దాఖలు చేయగా.. దీన్ని ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి.. ‘‘సరోగసీ పరిశ్రమను ఇక్కడ ప్రోత్సహిస్తే బిలియన్ డాలర్లకు విస్తరిస్తుంది. మీరు కెనడాలో ఉంటున్నారు. ఈ విషయంలో ఏదైనా ఉంటే ప్రభుత్వాన్ని అడగండి. ఇది మేం అడగాల్సిన సందర్భం కాదు. ఈ సరోగసీ పరిశ్రమను భారత్ లో ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఈ కేసు తదుపరి విచారణను 2024 జనవరి 15కు వాయిదా వేస్తున్నాం’’ అంటూ దర్మాసనం పేర్కొంది.

ఇక పిటిషన్ విషయానికి వస్తే.. చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న వారు భారతీయ పౌరులని.. వారు భారత్ లో శాశ్వత నివాసితులుగా పేర్కొన్నారు. అలాంటి వారిలో సంతానం లేని జంటలు ఎన్నో ఉన్నాయని.. వారు తల్లిదండ్రులు కావాలని కోరుకుంటున్నట్లుగా వాదనలు వినిపించారు. అలా తల్లిదండ్రులు కావాలని కోరుకునే వారికి ఈ సరోగసీ ఒక విధానమని.. తాజా నిబంధనలు తమకు అడ్డుగా నిలిచాయని వారు పేర్కొన్నారు. 2022 డిసెంబరులో దంపతులకు డోనర్ ఓసైట్ తో సరోగసీ కోసం మెడికల్ ఇండికేషన్ సర్టిఫికేట్ మంజూరు చేశారని.. వారు అధునాత చికిత్సగా ఈ విధానాన్ని అనుసరించొచ్చని పేర్కొన్నారు. అయితే.. 2023 మార్చి 14న సరోగసీ నిబంధనల్ని సవరించారని.. దాతల సరోగసీని కేంద్రం నిషేధించిందని పేర్కొంటూ తమకు అనుమతి ఇవ్వాలని కోరిన సందర్భంలో ఢిల్లీ హైకోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణలో ఎలాంటి నిర్ణయాన్ని వెలువరుస్తుందో చూడాలి.