Begin typing your search above and press return to search.

భారత్‌ పై రష్యా అధినేత సంచలన వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో తాజాగా భారత్‌ రిపబ్లిక్‌ డే వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   26 Jan 2024 1:32 PM GMT
భారత్‌ పై రష్యా అధినేత సంచలన వ్యాఖ్యలు!
X

భారత్‌ తో సుదీర్ఘ మైత్రీ సంబంధాలు ఉన్న అతికొద్ది దేశాల్లో రష్యా ఒకటి. రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ కు అత్యంత ఇష్టమైన దేశాల్లో భారత్‌ ఒకటి. ఇప్పటికే పలు పర్యాయాలు ఆయన భారత్‌ లో పర్యటించారు. ఇదే క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం రష్యాలో పర్యటించి భారత్‌ కు మిత్రదేశమేదో తమ దేశంలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడంటూ రష్యాను ఆకాశానికెత్తారు.

ఈ నేపథ్యంలో తాజాగా భారత్‌ రిపబ్లిక్‌ డే వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ఆయన కొనియాడారు. భారత్‌ లాంటి విదేశాంగ విధానాన్ని నేటి ప్రపంచంలో పాటించడం అంత సులువు కాదన్నారు. భారత రాజకీయాలను ప్రభావితం చేసేందుకు బయట నుంచి ఆటలు ఆడేవారి ప్రయత్నాలకు భవిష్యత్తు ఉండదని వ్యాఖ్యానించారు.

ఈ మేరకు ‘రష్యన్‌ స్టూడెంట్‌ డే’ సందర్భంగా రష్యాలోని కాలినింగ్రాడ్‌ ప్రాంతంలోని యూనివర్సిటీ విద్యార్థులతో పుతిన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు.

మోదీ సారథ్యంలో.. భారత్‌ స్వతంత్ర విదేశీ విధానాన్ని అనుసరిస్తోందన్నారు. నేటి ప్రపంచంలో అది అంత తేలిక కాదని పుతిన్‌ అభిప్రాయపడ్డారు. సుమారు 150 కోట్ల జనాభా కలిగిన భారత్‌ కు స్వతంత్ర విదేశీ విధానాన్ని అవలంబించే హక్కు ఉందని చెప్పారు.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉందని పుతిన్‌ కొనియాడారు. అది కూడా ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందని ప్రశంసించారు. మోదీ సారథ్యంలోనే భారత్‌ ఇంతటి వేగం పుంజుకుందన్నారు.

దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మోదీ నిర్ణయాలు తీసుకోరని పుతిన్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత్, ఆ దేశ నాయకత్వంపై రష్యా ఆధారపడవచ్చు అని పుతిన్‌ తన అభిమానాన్ని చాటుకున్నారు. భారత్‌ లో రాజకీయ పలుకుబడి కోసం ఆటలాడవద్దని పరోక్షంగా అమెరికాను ఆయన హెచ్చరించారు. ఒకవేళ బయటి శక్తులు అలాంటి ప్రయత్నాలు చేసినా వాటికి భవిష్యత్తు ఉండదన్నారు.

భారత్‌ కు గొప్ప సంస్కృతి ఉందని పుతిన్‌ కొనియాడారు. జాతీయ టీవీ ఛానెళ్లలో భారతీయ సినిమాలను ప్రసారం చేసే అతికొద్ది దేశాల్లో రష్యా ఒకటి అని ఆయన గుర్తు చేశారు. ఇలా మరే దేశం చేస్తుందని అనుకోవడం లేదన్నారు.

నరేంద్ర మోదీ నాయకత్వంలో మొదలైన ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమాన్ని రష్యాతో పాటు ఎన్నో దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని పుతిన్‌ తెలిపారు. ఆ ప్రణాళికలన్నింటినీ ఆచరణలో పెట్టేందుకు భారత భాగస్వాములతో కలిసి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. భారత్‌ కు వచ్చే విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా రష్యా నుంచే వస్తున్నాయన్నారు. చమురు శుద్ధి కర్మాగారం కొనుగోలు, గ్యాస్‌ స్టేషన్లు, పోర్టులు తదితర రంగాల్లో రష్యా పెట్టుబడులను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.