షాక్: డ్రగ్స్ దందాలో మాజీ ఐపీఎస్ కొడుకు.. ఈగిల్ కంటికి దొరికేశాడు!
ఈ క్రమంలో వారు విస్తుపోయే వివరాలు వెల్లడయ్యాయి. ఒక సీనియర్ పోలీసు అధికారి కొడుక్కి డ్రగ్స్ దందాలో కీలక భూమిక పోషిస్తున్న విషయాన్ని గుర్తించారు.
By: Tupaki Desk | 15 July 2025 10:33 AM ISTడాక్టర్లు. యాక్టర్లు.. సెలబ్రిటీలు.. పొలిటీషియన్లు.. ఐటీ ఉద్యోగులు.. వీళ్లు.. వాళ్లు అన్న తేడా లేకుండా డ్రగ్స్ దందాలోకి అన్ని వర్గాలు చేరుకుంటున్నాయి. ఇటీవల అదుపులోకి తీసుకున్న డ్రగ్స్ నిందితుడ్ని ఆరా తీసే క్రమంలో షాకింగ్ నిజం ఒకటి వెలుగు చూసింది. సీనియర్ పోలీసు అధికారి కొడుకు.. డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరిస్తునన్న వైనాన్ని గుర్తించారు. మరింత విస్మయానికి గురి చేసే అంశం ఏమంటే.. సదరు పోలీసు అధికారి కొడుకు ఏడాది క్రితం డ్రగ్స్ దందా కేసులో నిందితుడైనప్పటికి.. ఇప్పటికి అరెస్టు చేయకపోవటం విశేషం.
ఇటీవల కాలంలో ‘ఈగిల్’ పేరుతో ఒక టీంను పోలీసు శాఖలో ఏర్పాటు చేయటం తెలిసిందే. మాదకద్రవ్యాలపై డేగకన్ను వేసి.. వాటి అంతు చూసేందుకు ఏర్పాటు చేసిన ఈ టీం ఇప్పటివరకు పలు డ్రగ్స్ రాకెట్లను బద్ధలు చేస్తోంది. ఇటీవల మేడ్చల్ పరిధిలోని కొంపల్లిలో మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ దందాలో భాగస్వామి అయిన అతడితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో వారు విస్తుపోయే వివరాలు వెల్లడయ్యాయి. ఒక సీనియర్ పోలీసు అధికారి కొడుక్కి డ్రగ్స్ దందాలో కీలక భూమిక పోషిస్తున్న విషయాన్ని గుర్తించారు. సదరు పోలీసు అధికారి సుపుత్రుడి గురించి వివరాలు ఆరా తీసే క్రమంలో మరో షాకింగ్ అంశం వెలుగు చూసింది. 2024 జనవరిలో సదరు సుపుత్రుడు నిజామాబాద్ పోలీసులు డ్రగ్స్ కేసులో అతడిపై కేసునమోదు చేశారు. సదరు కేసులో ఏ3గా ఉన్నప్పటికి..ఇప్పటివరకు అతడ్ని అరెస్టు చేసింది లేదు.
ఇతడు ఢిల్లీ.. హిమాచల్ ప్రదేశ్.. పంజాబ్ నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చి తెలంగాణలోని పలుచోట్ల అమ్ముతాడని.. డ్రగ్స్ నెట్ వర్కులో ఇతడు కీలక భూమిక పోషిస్తారని చెబుతున్నారు. ఇక.. ఈ సుపుత్రుడి తండ్రి విషయానికి వస్తే ఆయన సీనియర్ పోలీసు అధికారిగా పని చేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం పోలీసు శాఖలోని ఒక విభాగంలో ఓఎస్డీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. హైప్రొఫైల్ కేసు కావటంతో ఈ సమాచారాన్ని ప్రభుత్వానికి అందించినట్లుగా చెబుతున్నారు.
నిజామాబాద్ కేసులో మిగిలిన నిందితులపై ఛార్జిషీట్ వేసిన పోలీసులు.. పోలీసు అధికారి సుపుత్రుడి మీద మాత్రం కేసుకట్టలేదని చెబుతున్నారు. సాధారణంగా ఏదైనా క్రిమినల్ కేసు నమోదైతే.. వెంటనే అరెస్టు కాకుండా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించటం మామూలే. సదరు పోలీసు అధికారి సుపుత్రుడు మాత్రం బెయిల్ ప్రయత్నంకూడా చేయకపోవటం విశేషం. తాజా ఉదంతంలో అయినా.. అతడిపై చర్యలు ఉంటాయా? లేదంటే నిజామాబాద్ కేసు మాదిరి లైట్ తీసుకొని వదిలేస్తారా? అన్నది పోలీసు వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
