భవనంపై నుంచి దూకి విదేశాంగ శాఖ అధికారి ఆత్మహత్య
ఒత్తిడిని ఎదుర్కోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
By: Tupaki Desk | 7 March 2025 11:00 PM ISTఅత్యున్నత స్థాయి ఉద్యోగాలు చేసే వారికి అంతకు మించిన ఒత్తిడి ఉంటుంది. ఇక ఉద్యోగాల్లో బదిలీలు, ఇష్టం లేని చోట పనిచేయడాలు.. ఉద్యోగ ఒత్తిడి.. కుటుంబానికి దూరం కావడం లాంటి కారణాలు మానసికంగా మనిషిని కృంగదీస్తాయి. అందుకే చాలా మంది ఉద్యోగులు ఈ కాలంలో మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒత్తిడిని ఎదుర్కోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
దిల్లీ లోని చాణక్యపురిలో విదేశాంగ శాఖ అధికారి జితేంద్ర రావత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఆయన నివాసం ఉన్న భవనపు పై అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు.
రావత్ విదేశాంగ శాఖకు చెందిన రెసిడెన్షియల్ సొసైటీలో తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉత్తరాఖండ్ రాజధాని దేహ్రాదూన్‌లో ఉంటున్నారు. గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని దిల్లీ పోలీసులు వెల్లడించారు.
విదేశాంగ శాఖ ఈ విషాదకర ఘటనపై స్పందించింది. అధికారిక ప్రకటనలో, "ఈ క్లిష్ట పరిస్థితిలో బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని విధాలా సహాయాన్ని అందిస్తున్నాం. కేసు విచారణకు సంబంధించి దిల్లీ పోలీసులతో సమన్వయం కొనసాగిస్తున్నాం" అని తెలిపింది.
అయితే, బాధిత కుటుంబ గోప్యతను దృష్టిలో ఉంచుకుని మరిన్ని వివరాలను వెల్లడించలేమని పేర్కొంది.
