Begin typing your search above and press return to search.

మరోసారి మనసు దోచేసిన లూలూ గ్రూపు ఛైర్మన్.. ఇది తెలిస్తే ఫిదానే!

తన వరకు వచ్చిన ఏ విషయం మీదనైనా.. క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే అలవాటున్న అలీ.. తాజాగా అలాంటి తీరును మరోసారి ప్రదర్శించారు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 10:42 AM IST
మరోసారి మనసు దోచేసిన లూలూ గ్రూపు ఛైర్మన్.. ఇది తెలిస్తే ఫిదానే!
X

మరోసారి తన స్పందనతో అందరి మనసుల్ని దోచేసేశారు లూలూ గ్రూపు ఛైర్మన్ ఎం.ఎ. అలీ. దాతృత్వంలో ఆయన ఒక స్థాయిగా చెబుతుంటారు. తాజాగా ఆయన కేరళలోని పాలక్కడ్ లో తన కొత్త మాల్ ను ఓపెన్ చేశారు. ఈ మధ్యనే తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి హైదరాబాద్ లోని కేపీహెచ్ బీలో లూలూ మాల్ ను ఓపెన్ చేసిన వైనం తెలిసిందే. తన వరకు వచ్చిన ఏ విషయం మీదనైనా.. క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే అలవాటున్న అలీ.. తాజాగా అలాంటి తీరును మరోసారి ప్రదర్శించారు.

పాలక్కడ్ లో ప్రారంభించిన మాల్ ఓపెనింగ్ కు వచ్చిన సందర్భంగా రెండు చేతుల్లేని ఒక దివ్యాంగుడితో సెల్ఫీ దిగేందుకు ఆయన సరేనన్నారు. సదరు వ్యక్తి తన జేబులో ఉన్న ఫోన్ ను తన కాళ్లతో తీసుకొని.. ఫోటోను క్లిక్ చేయటంతో ఆయన ఆశ్చర్యపోయారు. వావ్.. మీరు సొంత ఫోన్ కూడా యాక్సిస్ చేయగలరా? అని ప్రశ్నించగా.. ఆ వ్యక్తి అవునని చెప్పారు. ఈ సందర్భంగా అతగాడి ప్రతిభను.. ఆత్మవిశ్వాసాన్ని చూసి ముగ్దుడైన ఆయన.. ఆ దివ్యాంగుడి తల మీద అప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు.

సెల్ఫీ దిగిన తర్వాత.. సంకోచిస్తూనే తనకు ఏదైనా ఉద్యోగం ఇవ్వగలరా? అంటూ అలీని అడగ్గా.. నువ్వేం జాబ్ చేయగలవని అడగ్గా.. తాను ఏ పని అయినా చేస్తానని చెప్పిన ఆత్మవిశ్వాసానికి ముగ్దుడైన ఆయన వెంటనే తన సిబ్బందిని పిలిచి.. ఆ వ్యక్తికి వెంటనే తగిన ఉద్యోగం ఇవ్వాలని.. తాను తర్వాత వచ్చే వేళకు.. అతను జాబ్ చేస్తుండాలని ఆదేశించారు. అలీ మాటలకు చెమ్మగిల్లిన కళ్లతో ఉన్న ఆ యువకుడ్ని భుజం తట్టారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయన్ను నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆయన స్పందించిన తీరుకు పెద్ద ఎత్తున సానుకూల స్పందన లభిస్తోంది.