Begin typing your search above and press return to search.

సెహ్మత్... ఈ భారత మహిళా గూఢచారి గురించి తెలుసుకోవాల్సిందే!

ఈ క్రమంలో 1971లో జరిగిన యుద్ధంలో ఓ మహిళ గూఢచారిగా పనిచేసి భారతదేశ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆమె పేరు సెహ్మత్!

By:  Tupaki Desk   |   6 May 2025 4:00 PM IST
Sehmat The Spy Story
X

దేశంలో కోట్లాది మంది ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే దాని వెనుక సరిహద్దుల్లో సైన్యం త్యాగాలతో పాటు కొన్ని సార్లు సరిహద్దు అవతల శత్రుదేశంలో గూఢచర్యం చేసే సేవలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా 1971 యుద్ధ సమయంలో పాక్ వెళ్లి భారత విజయంలో కీలక భూమిక పోషించిన ఓ మహిళా గుఢచారి విషయం వెలుగులోకి వచ్చింది.

అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో... పాక్ కు భారత్ ఈసారి గట్టిగానే బుద్ధి చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో గతంలో భారత్ – పాక్ మధ్య యుద్ధం జరిగినప్పుడు పాకిస్థాన్ వెళ్లిన ఓ భారత మహిళ ధైర్య సాహసాలు, త్యాగాలు, వెలకట్టలేనివి వెలుగులోకి వచ్చాయి.

వాస్తవానికి గతంలో భారత్ – పాక్ మధ్య 1947-48, 1965, 1971, 1999లో యుద్ధాలు జరిగాయి! ఈ క్రమంలో 1971లో జరిగిన యుద్ధంలో ఓ మహిళ గూఢచారిగా పనిచేసి భారతదేశ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆమె పేరు సెహ్మత్!

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న సెహ్మత్ అనే యువతి జీవితం 1969లో ఓ కీలక మలుపు తీసుకుంది. క్యాన్సర్ భారిన పడిన ఆమె తండ్రి ఆ ఏడాది కన్నుమూశారు. ఆయన భారత నిఘా సంస్థ "రా"కు చెందిన అధికారి. అయితే.. తన మరణానంతరం దేశానికి సేవ చేయాలని కుమార్తె వద్ద మాట తీసుకున్నారు తండ్రి. దీంతో.. ఆమె "రా"లో చేరారు.

గ్రాడ్యుయేషన్ తో పాటు శాస్త్రీయ నృత్యం, వయోలిన్ నేర్చుకుంటున్న 20 ఏళ్ల అమ్మాయి.. తన తండ్రి కోరిక మేరకు చదువును పక్కనపెట్టి, పాకిస్థాన్ లో గూఢచారిగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె లక్ష్యం పాకిస్థాన్ ఆర్మీ సీనియర్ ఆఫీసర్ ఇక్బాల్ సయ్యద్. అతడిని ఆమె వివాహం చేసుకోవడం ఆమె ఫస్ట్ టాస్క్!

అనుకున్నట్లుగానే పాక్ వెళ్లిన ఆమె.. ఆ దేశ ఆర్మీ అధికారి ఇక్బాల్ సయ్యద్ ను వివాహం చేసుకున్నారు. పాక్ లోనే నివసించారు. ఆ సమయంలో పాకిస్థాన్ లోని సైనికులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆమె రాబట్టారు. ఆ సమయంలోనే ఆమె పాకిస్థాన్ రక్షణ వర్గాలు, నిఘా వర్గాలలోకి ప్రవేశించింది.

ఈ సమయంలో తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో స్వాతంత్ర్యం కోసం పిలుపుల మధ్య రెండు దేశాల మధ్య ఉద్రిక్తత రోజు రోజుకీ పెరిగింది. దీంతో.. 1971లో తూర్పు పాకిస్థాన్ స్వేచ్ఛను పొందే విషయంలో జోక్యం చేసుకోవాలని భారత్ నిర్ణయించుకుంది.. దీంతో, యుద్ధానికి సిద్ధమైంది.

ఈ సమయంలో భారత యుద్ధనౌక ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ ను ధ్వంసం చేయాలని, సముద్రంలో ముంచేయాలని పాక్ పన్నిన కుట్రల ప్రణాళికతో పాటు అత్యంత కీలకమైన నిఘా సమాచారాన్ని తెలుసుకొని ఆమె భారత్ కు చేరవేశారు. దీంతో.. అప్రమత్తమైన భారత్.. పాకిస్థాన్ కుట్రలను సక్సెస్ ఫుల్ గా తిప్పికొట్టింది. ఇది పాక్ జలాంతర్గామి పీ.ఎన్.ఎస్. ఘాజీని భారత్ ధ్వంసం చేయడానికి ఉపయోగపడింది.

ఇలా దేశం కోసం ఎన్నో త్యాగాలు, సేవలు చేసిన సెహ్మత్... గర్భవతిగా ఉన్న సమయంలో పాక్ నుంచి భారత్ తిరిగి వచ్చారు. అప్పటికే ఆమె మానసికంగా చాలా దెబ్బతిన్నారు. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె గుర్తింపును భారత్ బయటపెట్టలేదు. కానీ.. ఆమె చేసిన సేవలు, త్యాగాలు.. దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి!

ఇలా ఆమె చేసిన సేవలు 1971 యుద్ధంలో పాకిస్థాన్ పై చారిత్రాత్మక విజయం సాధించడానికి ఉపయోగపడ్డాయి. ఈ వివరాలను రచయిత హరీందర్ సింగ్ సిక్కా తన నవల "కాలింగ్ సెహ్మత్" లో పేర్కొన్నారు.