టీడీపీ పెద్దల గుడ్ లుక్స్ కోసం తమ్ముడు ఆరాటం
తెలుగుదేశం పార్టీ పెద్దల కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఆయన చాలా చేస్తున్నారు. ఏ కార్యక్రమం అయినా ఆయనే ముందు ఉంటున్నారు.
By: Tupaki Desk | 4 Jun 2025 4:16 AMతెలుగుదేశం పార్టీ పెద్దల కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఆయన చాలా చేస్తున్నారు. ఏ కార్యక్రమం అయినా ఆయనే ముందు ఉంటున్నారు. చాలా మంచిగా రియాక్ట్ అవుతున్నారు. ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ సీతం రాజు సుధాకర్. ఆయన గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఆయన వైసీపీలో సుదీర్ఘ కాలం ఉన్నారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే ఆ సీటులో ఆయనకు చాన్స్ ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరడమే కాదు 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన విజయానికి ఎంతో కృషి చేశారు. ఆయన అర్ధ బలం చాలా గొప్పది. దాంతో తానే అంతా అయి గట్టిగానే ఖర్చు పెట్టారని చెబుతారు.
ఆయన విశాఖ ఎంపీ భరత్ కి సన్నిహితులుగా ఉంటున్నారు. ఆయన ఆశలన్నీ 2029 ఎన్నికల మీద ఉన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ కడపలో తొలిసారిగా జరిపిన మూడు రోజుల మహానాడుకు సీతం రాజు సుధాకర్ పెద్ద ఎత్తున బస్సులను పెట్టి మరీ దక్షిణం నుంచి కార్యకర్తలను తీసుకుని వెళ్ళారు. ఆ విధంగా తన సమర్థతను నిరూపించుకున్నారు.
అంతే కాదు పార్టీకి ఫండ్ రూపంలో పాతిక లక్షల రూపాయలను ఇచ్చారు. ఇక ఇంచార్జిగా ఉంటూ నియోజకవర్గం మొత్తం పర్యటిస్తున్నారు. సొంత నిధులు వెచ్చింది మరీ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో చురుకుగా పాలు పంచుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో ఆయన పుట్టిన రోజు వేడుకలను కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇక ఇప్పటికే అధికార కూటమిలో కీలకమైన టీడీపీకి నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్న సీతం రాజు దాదాపు ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.
అక్కడ జనసేన గెలిచినా టీడీపీ తరఫున జనాలకు ఆయన కూడా చేయాల్సింది చేస్తూ పసుపు పార్టీ జెండాను రెపరెపలాడిస్తున్నారు విశాఖ దక్షిణంలో టీడీపీకి బలం చాలా ఎక్కువ. కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీకి అండగా ఉన్నారు. టికెట్ సాధిస్తే చాలు గెలుపు ఖాయమన్న భావన ఉంది. నియోజకవర్గం ఏర్పాటు అయ్యాక అనేక సార్లు టీడీపీ అక్కడ గెలిచింది.
దాంతో ఎమ్మెల్యే టికెట్ ని టార్గెట్ చేసిన సీతం రాజు ఏడాది కాలంలోనే టీడీపీలో తానేంటో నిరూపించుకున్నారని చెబుతున్నారు. హై కమాండ్ దీవెనలు ఉంటే రేపటి ఎమ్మెల్యే నేనే అన్నది ఆయన ఆలోచనగా ఉంది. మరి అధినాయకత్వం అయితే ఇప్పటిదాకా ఆయనకే మద్దతుగా ఉంది. రేపటి రోజున సామాజిక సమీకరణలు ఏమైనా మారితే చెప్పలేరు కానీ లేకపోతే సీతం రాజుకే చాన్స్ ఉండొచ్చు అని అంతా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.