Begin typing your search above and press return to search.

"నియంత పాల‌న‌కు చ‌క్కటి ఉదాహ‌ర‌ణ‌".. ఫోటో షేర్ చేసిన సీతక్క!

వయోభారం వల్ల అద్వానీ కూర్చోవచ్చు గానీ.. రాష్ట్రపతి నిల్చున్నప్పుడు మోడీ కుర్చోవడం ఏమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 April 2024 9:43 AM GMT
నియంత పాల‌న‌కు చ‌క్కటి ఉదాహ‌ర‌ణ‌.. ఫోటో షేర్  చేసిన సీతక్క!
X

దేశంలో కుల మత బేధాలు ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయని.. కాకపోతే అవి చాలా సందర్భాల్లో చాపకింద నీరులా ఉంటే.. మరికొన్ని సందర్భాల్లో మాత్రం తెరపైకి వస్తుంటున్నాయని అంటుంటారు సామాజికవేత్తలు, కులంహారాన్ని వ్యతిరేకించేవారు! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు అవమానం జరిగిందంటూ ఒక కామెంట్ చేస్తూ, అందుకు సాక్ష్యంగా ఒక ఫోటోను షేర్ చేశారు సీతక్క!

అవును... ఈ దేశానికి రాష్ట్రపతే ప్రథమ పౌరుడు అనేది తెలిసిన విషయమే. ప్రోటోకాల్ విషయంలో కూడా రాష్ట్రపతి తర్వాతే ఎవరైనా! అలాంటి రాష్ట్రపతి నిలబడి ఉండగా.. పక్కనే ప్రధాని మోడీ, ఎల్.కే. అద్వానీ కూర్చుని ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేశారు సీతక్క. ఈ సందర్భంగా... "భారతదేశంలో నియంత పాలనకు ఈ ఫోటో చక్కటి ఉదాహరణ. ఓ ఆదివాసీ మహిళకు జరిగిన ఈ ఘోర అవమానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.

దీంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ గా మారింది! ఈ ట్వీట్ కింద కామెంట్లు హోరెత్తిపోతున్నాయి! “ఓట్ల కోసమే ఆదివాసీ సమాజానికి చెందిన మహిళను రాష్ట్రపతిని చేశారు.. ఇప్పుడు ఇలా అవమానిస్తున్నారు” అంటూ గతంలో మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు! అయితే.. దీన్ని అంత బూతద్ధంలో పెట్టి చూడనవసరం లేదు.. అద్వానీ కూడా లేచి నిలబడి ఉండేవారు కానీ... ఆయనకు వయసు రీత్యా మినహాయింపు ఇచ్చారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు! మరి మోడీ ఎందుకు కూర్చున్నారు? మరో ప్రశ్న!!

ఇక ఈ ఫోటో వెనకున్న స్టోరీ విషయానికొస్తే... బీజేపీ అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్.కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది! దీంతో... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి ఈ అవార్డును అందజేశారు! ఆ సందర్భంలోది ఈ ఫోటో. దీంతో.. ఇది రాష్ట్రపతికి జరిగిన అవమానం, ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానం అని అంటున్నారు!

వయోభారం వల్ల అద్వానీ కూర్చోవచ్చు గానీ.. రాష్ట్రపతి నిల్చున్నప్పుడు మోడీ కుర్చోవడం ఏమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

కాగా... నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూను ఆహ్వానించకపొవడంపైనా... బీజేపీ & మోడీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా... పార్లమెంట్ అనేది భారత గణతంత్రానికి అత్యున్నత చట్టసభ అని.. దానికి అత్యున్నత రాజ్యాంగ అధికారి రాష్ట్రపతి అని గుర్తు చేస్తూ... అలాంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూను ఆ కొత్త భవనం ప్రారంభోత్సవానికి కనీసం ఆహ్వానించలేదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పెను దురమారమే రేగింది.