Begin typing your search above and press return to search.

సీతక్క ప్రయాణం... నక్సలైట్ - లాయర్‌ - ఎమ్మెల్యే - మంత్రి!!

అవును... 1971 జూలై 9న జన్మించిన డి అనసూయ అలియాస్ సీతక్క 1988 లోనే నక్సల్ పార్టీలో చేరారు

By:  Tupaki Desk   |   7 Dec 2023 11:00 AM GMT
సీతక్క ప్రయాణం... నక్సలైట్ - లాయర్‌ - ఎమ్మెల్యే - మంత్రి!!
X

తెలంగాణ కాంగ్రెస్‌ లో మహిళా నేతగా ప్రత్యేక ముద్ర వేసుకున్న ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క నేటి ప్రమాణ స్వీకర సమయంలో హైలెట్ గా నిలిచారన్నా అతిశయోక్తి కాదు. మంత్రులుగా ప్రమాణ స్వీకర సమయంలో ఆమె పేరు పిలవగానే ఎల్బీ స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. కొన్ని సెకన్ల పాటు వేదికపై ఉన్నవారు సైతం ఆశ్చర్యపోయి ఉంటారన్నా అతిశయోక్తి కాదేమో! దీంతో మరోసారి సీతక్క ప్రయాణంపై చర్చ మొదలైంది.

తెలంగాణ కాంగ్రెస్ లో సీతక్కది ప్రత్యేక స్థానం అని చెప్పుకోవచ్చు. ఆదివాసీ కోయ జాతికి చెందిన దంసారి అనసూయ అలియాస్ సీతక్క అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరన్నా కూడా అతిశయోక్తి కాదు! విద్యార్ధి దశ నుండే పోరాట జీవితం మొదలు పెట్టిన నేడు ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషించేలా కేబినెట్ మినిస్టర్ గా ప్రమాణం చేసే వరకూ ఆమె జీవితం ఎందరికో ఆదర్శం అనే చెప్పాలి.

అవును... 1971 జూలై 9న జన్మించిన డి అనసూయ అలియాస్ సీతక్క 1988లోనే నక్సల్ పార్టీలో చేరారు. అప్పటికి ఆమె వయస్సు 14 సంవత్సరాలు! 10వ తరగతి చదువుతున్న సమయంలో నక్సల్స్ ఉద్యమ వైపు ఆకర్షితులయ్యారు. ప్రధానంగా ఫూలన్ దేవి రచనల నుండి సీతక్క ప్రేరణ పొందారని చెబుతారు. ఈ క్రమంలో... ఆర్థిక దోపిడీ కులవాద వివక్షలకు వ్యతిరేకంగా ఆమె బలంగా పోరాడారు!

ఈ క్రమంలో జనశక్తి పార్టీలో చేరారు. ఏళ్లు గుడుస్తున్నా ఆదివాసుల మీద, అణగారిన వర్గాలమీద జరగుతున్న దౌర్జన్యాలను భరించలేకపోయారు. అడవులలో, కొండలు, గుట్టలలో నిరంతరం మృత్యువు వెన్నాడుతున్నా... నిద్రాహారాలు కరువై అత్యంత కఠోరమైన పోరాటం సాగిస్తూ ఆ ఉద్యమంలోనే సీతక్క తన పోరాట ప్రయాణం సాగించారు. అనంతరం చాలా సంవత్సరాలు ఆమె అజ్ఞాత జీవితం గడిపారు.

మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని నందమూరి తారక రామారావు పిలుపునివ్వడంతో ఆమె పోరుబాట విడిచి ప్రజల్లోకి వచ్చారు! ఈ సమయంలోనే 2001లో హైదరాబాద్ లో ఎల్.ఎల్.బి చదివారు. ఇలా చట్టం అధ్యయనం చేయడంతో ఆమెకు ప్రజా విధానం, ప్రజా పాలనపై ఆసక్తి ఏర్పడింది. ఈ సమయంలో స్థానికంగా ప్రాజాసమస్యలపై పోరాడటంలో యాక్టివ్ గా ఉండే సీతక్కకు చంద్రబాబు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో 2004లో తొలిసారిగా టీడీపీ నుంచి పోటీ చేసిన సీతక్క, కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. అనంతరం 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ టిక్కెట్ పై పోటీచేసి అదే కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్ పై గెలుపొందారు. ఫలితంగా 2009 లో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు సీతక్క.

ఈ క్రమ్మలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆమె... నాటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆరెస్స్) అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సీతక్క టీడీపీని వీడి కాంగ్రెస్స్ పార్టీ లో చేరారు.

ఈ క్రమంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్స్ అభ్యర్థి అజ్మీరా చందులాల్ పై 22,671 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు తాజా ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచారు. ఈ క్రమంలోనే తాజాగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె పేరు పలకగానే... ఒక్కసారిగా ఎల్బీ స్టేడియం హోరెత్తిపోయింది.