Begin typing your search above and press return to search.

ఈ ’సీమాం’తర ప్రేమ.. భారత్ ను వదలనంటోంది.. భారతీయురాలేనట

దాదాపు రెండేళ్ల కిందట దేశవ్యాప్తంగా ఓ కథనం సంచలనం రేకెత్తించింది.. చాలామందికి ఆసక్తి కూడా కలిగించింది.. అదే సమయంలో దీనిపై సినిమా స్టోరీలు అల్లేవరకు వెళ్లింది..

By:  Tupaki Desk   |   26 April 2025 11:00 PM IST
ఈ ’సీమాం’తర ప్రేమ.. భారత్ ను వదలనంటోంది.. భారతీయురాలేనట
X

దాదాపు రెండేళ్ల కిందట దేశవ్యాప్తంగా ఓ కథనం సంచలనం రేకెత్తించింది.. చాలామందికి ఆసక్తి కూడా కలిగించింది.. అదే సమయంలో దీనిపై సినిమా స్టోరీలు అల్లేవరకు వెళ్లింది..

కారణం.. పాకిస్థాన్ కు చెందిన సీమా హైదర్.. ఇంతకూ ఎవరీమె? అంటే.. పబ్ జీ గేమ్ లో పరిచయమైన భారతీయుడిని ఇష్టపడి సరిహద్దులు దాటి వచ్చి మనువాడిన మహిళ.

పెహల్గాం ఘటన అనంతరం భారత్ తన చర్యలను ముమ్మర చేసి పాకిస్థాన్ ను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ లో ఉన్న పాకిస్థానీలను వెళ్లిపోవాలని ఆదేశించింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు ఈ స్థాయికి చేరడంతో సీమా హైదర్ ను బహిష్కరిస్తారా? అనే కథనాలు వచ్చాయి.

ఇవన్నీ సీమా చెవిన కూడా పడ్డాయి. దీంతో తనకు పాకిస్థాన్ వెళ్లే ఉద్దేశం లేదని అంటోంది. 2023లో ప్రియుడు సచిన్ మీనాను వెదుక్కుంటూ వచ్చిన సీమా హైదర్.. అతడినే పెళ్లాడి యూపీలో స్థిరపడింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమెకు పాక్‌ వెళ్లే ఉద్దేశం లేదని తెలుస్తోంది. ఇక్కడే ఉండేందుకు అనుమతించాలని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలను కోరుతూ వీడియో విడుదల చేసింది.

తాను పాకిస్థాన్ జాతీయురాలినే అయినా.. భారతీయుడిని పెళ్లాడి ఈ దేశానికి కోడలు అయ్యానని అంటోంది. సచిన్‌ మీనాతో వివాహం జరగ్గానే హిందూ మతం స్వీకరించినట్లు తెలిపింది.

కాగా, సచిన్ మీనా-సీమా హైదర్ లకు ఒక కుమార్తె కూడా పుట్టింది. పాకిస్థాన్ మీద దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నా.. సీమాను ఇక్కడినుంచి పంపేంత తీవ్రంగా పరిస్థితులు లేవని అంటున్నారు ఆమె తరఫు న్యాయవాది. ఆమె పాకిస్థాన్‌ పౌరురాలు కాదు కాబట్టి దేశం విడిచివెళ్లాల్సిన అవసరం లేదన్నారు.

కాగా, సీమాకు మొదటి భర్తతోనే నలుగురు పిల్లలు. అయినప్పటికీ సచిన్ మీనాను ప్రేమించి పిల్లలతో సహా 2023లో సరిహద్దులు దాటి భారత్‌లోకి అక్రమంగా అడుగుపెట్టింది. సచిన్ ను వివాహం చేసుకుంది. అయితే, ఆమెపై తొలుత పాక్ ఏజెంట్ అనే అనుమానాలు కలిగాయి. చివరకు తనకు భారత దేశ పౌరసత్వం కల్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది.