రోడ్డు ప్రమాదంలో వెంటాడిన రాజకీయం?! కుమారుడిపై మాజీ మంత్రి సీదిరి ఎఫెక్ట్
వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యవహారశైలి ఆయన కుమారుడి భవిష్యత్తును ఇబ్బంది పెట్టిందా? అన్న చర్చ జరుగుతోంది.
By: Tupaki Political Desk | 14 July 2026 1:25 PM ISTవైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యవహారశైలి ఆయన కుమారుడి భవిష్యత్తును ఇబ్బంది పెట్టిందా? అన్న చర్చ జరుగుతోంది. ఓ రోడ్డు ప్రమాదానికి కారణం అంటూ మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మను పోలీసులు అరెస్టు చేశారు. సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో స్టేషన్ బెయిలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కుమారుడి విషయంలో మాజీ మంత్రి సీదిరి చేసిన పొరపాటుతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సివచ్చిందని అంటున్నారు. దీంతో మాజీ మంత్రి కుమారుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతోపాటు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపైనా పోలీసు కేసు నమోదు అయిందని చెబుతున్నారు.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ గత శుక్రవారం బుల్లెట్ నడుపుతూ గొర్రెల కాపరిని ఢీకొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనలో గొర్రెలకాపరి మరణించగా, విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన కుమారుడును తప్పించి ఆయన స్థానంలో తన అనుచరుడిని పోలీసులకు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ప్రమాదంలో మరణించిన గొర్రెలకాపరి కుటుంబ సభ్యులతో రాజీ చేసుకోవడమే కాకుండా రూ.1.50 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇదంతా సాఫీగా జరిగిపోగా, గత ఆదివారం ఓ దినపత్రికలో ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వార్త కథనం వెలువడింది. దీంతో రాజకీయం కూడా శరవేగంగా మారిపోయిందని చెబుతున్నారు.
బాధితులతో మాజీ మంత్రి అప్పలరాజు రాజీ చేసుకున్నప్పటికీ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు అవడం, ప్రమాదానికి కారణమైన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడుని తప్పించి వేరొకరిపై కేసు నమోదం చేయడం వివాదాస్పదమైందని అంటున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ నాయకులు ఫోకస్ చేయడంతో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారని చెబుతున్నారు. దీంతో పోలీసులు ప్రమాదానికి కారణాలపై లోతుగా విచారణ జరపగా, ప్రమాద సమయంలో మాజీ మంత్రి కుమారుడు ఆరవ్ వర్మ ఒక్కరే ద్విచక్ర వాహనం నడుపుతున్నట్లు సీసీ టీవీ పుటేజ్ లో గుర్తించారని చెబుతున్నారు. ఈ వీడియోలు వైరల్ కాగా, పోలీసులను తప్పుదారి పట్టించడంపై కేసుతీవ్రత ఎక్కువైందని అంటున్నారు. దీంతో స్టేషన్ బెయిలుపై బయటకు రావాల్సిన కేసులో మాజీ మంత్రి కుమారుడు రిమాండుకు వెళ్లాల్సివచ్చిందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి ఈ తరహా కేసుల్లో రాజీ ద్వారా ఎక్కువగా పరిష్కరిస్తుంటారు. అయితే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు దూకుడు కారణంగా ఆయన కుమారుడు బలైపోవాల్సివచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు ఆయన గత ప్రవర్తన కూడా కొంత కారణంగా చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, మాజీ మంత్రి అప్పలరాజు స్థానిక టీడీపీ నేతల విషయంలో కర్కశంగా వ్యవహరించడం వల్లే ఇప్పుడు వారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా ఈ అవకాశాన్ని వాడుకున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాద విషయంలో మాజీ మంత్రి న్యాయనిపుణులను సంప్రదించి తొలుత పోలీసుల ఎదుట కుమారుడు లొంగిపోయేలా ఏర్పాటు చేస్తే కేసు ఇంత జటిలమయ్యేది కాదని అంటున్నారు. మొత్తానికి రోడ్డు ప్రమాదంపై చోటుచేసుకున్న రాజకీయంతో మాజీ మంత్రి కుమారుడు జైలుకు వెళ్లాల్సివచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు.
