కుమారుడి కేసులో ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి.. బాధితుల సంచలన వీడియో వైరల్
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 16 July 2026 3:14 PM ISTవైసీపీ కీలక నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమంటూ సీదిరి అప్పలరాజు కుమారుడిని పోలీసులు అరెస్టు చేయగా, కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై సీదిరిపైనా క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును రాజీ చేసుకోడానికి మాజీ మంత్రి సీదిరి తొలుత ప్రయత్నించారని, బాధితులకు అడ్వాన్సుగా కొంత డబ్బు కూడా ఇచ్చారని ప్రచారం జరిగింది. దీనిపై బాధితులు మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. కేసు రాజీ కోసం మాజీ మంత్రి సీదిరి ప్రయత్నించారని, కానీ తాము అంగీకరించలేదని ఆ వీడియోలో బాధితులు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో ఈ నెల 10వ తేదీ రాత్రి మాజీ మంత్రి కుమారుడు ఆరవ్ వర్మ ప్రమాదవశాత్తూ గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టడంతో అతడు మరణించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ముందుగా ఆరవ్ వర్మకు బదులుగా మాజీ మంత్రి సీదిరి అనుచరుడైన సిద్ధార్థ్ అనే యువకుడు నేరం అంగీకరిస్తూ పోలీసులకు లొంగిపోయాడు. దీంతో పోలీసులు కూడా ముందుగా సిద్దార్థ్ నే అరెస్టు చేశారు. ఈ క్రమంలో గొర్రెల కాపరి కుటుంబంతో మాజీ మంత్రి అనుచరులు రాజీకి ప్రయత్నించినట్లు వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో చనిపోయిన గొర్రెల కాపరి దానయ్య తల్లి మాజీ మంత్రి అప్పలరాజుపై సంచలన ఆరోపణలు చేశారు.
ముందుగా మాజీ మంత్రి సీదిరి కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయని, కేసు రాజీ చేసుకుంటే లక్ష రూపాయలు నగదు ఇస్తామన్నారని, అదే సమయంలో తమ కోడలిని మాజీ మంత్రి ఇంట్లో పనికి పెట్టుకుంటామని చెప్పారని బాధితురాలు ఆరోపించారు. తన కుమారుడిని ప్రమాదంలో చంపేయడమే కాకుండా, లక్ష రూపాయలతో తమను సర్దుకోమనడం, కోడలిని జీవితాంతం వారింట్లో పనిమనిషిగా పెట్టుకుంటామని అనడం ఏంటని బాధితురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ కుమారుడు ప్రాణం విలువ లక్ష రూపాయలేనా? ప్రాణం పోగొట్టి, వారింట్లో పనికి రమ్మంటారా? అంటూ బాధిత వృద్ధురాలు నిలదీస్తున్న విధానం ఆలోచలనకు గురిచేస్తోందని అంటున్నారు.
ఇక ఈ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి కారణమవుతోందని అంటున్నారు. నిందితుడు ఆరవ్ వర్మకు కేవలం 18 ఏళ్లు మాత్రమేనని, ఆ వయసు పిల్లాడికి ఏం తెలుస్తుందంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాధితులు, యాదవ సంఘాలు మండిపడుతున్నాయి. జగన్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా నిరసన ప్రదర్శనలు, ర్యాలీలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. మరోవైపు కేసు రాజీ చేసుకోడానికి మాజీ మంత్రి అప్పలరాజు కేవలం రూ.లక్ష ఇవ్వగా, ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు చెల్లించడం చర్చనీయాంశం అవుతోంది. దీంతో కేసు విషయంలో బాధితులు పట్టుబిగిస్తున్నట్లు చెబుతున్నారు. ఫలితంగా మాజీ మంత్రి అప్పలరాజుకు ఈ కేసు పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అనుమానిస్తున్నారు.
