జగన్ అభిమానిపై పిడి గుద్దులు.. వీడియో వైరల్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అభిమాని ఒకరు గన్‌మెన్ చేతిలో దెబ్బలు తిన్నారు.
By: Tupaki Desk | 14 Aug 2025 10:23 PM ISTమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అభిమాని ఒకరు గన్‌మెన్ చేతిలో దెబ్బలు తిన్నారు. జగన్ సమక్షంలోనే ఈ దాడి జరగడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల పల్నాడు జిల్లా పర్యటన సమయంలో జగన్ అభిమాని ఒకరు ఆయన కారు కింద పడి మరణించారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర వివాదానికి దారి తీసింది. దీనికి తోడు అన్నట్లు జగన్ ఎక్కడికి వెళ్లినా అభిమానులు భారీగా తరలి వస్తుండటంతో భద్రతా పరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి కుమారుడి వివాహంలోనూ ఇదే సమస్య పునరావృతమైందని చెబుతున్నారు.
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కుమారుడి వివాహ వేడుకలకు మాజీ సీఎం జగన్ గురువారం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు, కరచాలనం చేసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. అభిమానులు మూకుమ్ముడి జగన్ వైపు దూసుకురావడంతో వారిని కట్టడి చేయడం ఆయన భద్రతా సిబ్బందికి తలకుమించిన భారమైంది. జగన్ భద్రత కోసం వినియోగించిన రోప్ పార్టీని సైతం తోసుకును అభిమానులు ముందుకు రావడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే గన్‌మెన్ ఒకరు అభిమానులపై పిడిగుద్దులు కురిపించారు.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడం, కొందరి చేతి వేళ్లు కారణంగా జగన్ చేతులు గీసుకుపోవడంతో గన్‌మెన్ అలా వ్యవహరించాల్సివచ్చిందని వైసీపీ స్థానిక నేతలు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే ఆయన బయటకు వెళితే అభిమానులు తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల భద్రతా పరమైన సమస్యలు వస్తున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం నిబంధల మేరకే సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పడంతో జగన్ ప్రైవేటుగా కొంతమంది సిబ్బందిని నియమించుకున్నారు. అయినప్పటికీ ఇటువంటి సంఘటనలు జరుగుతుండటం చర్చకు దారి తీస్తోంది.
