Begin typing your search above and press return to search.

ఐదేళ్లలో జీతం మూడు రేట్లు పెంచుకున్న సెక్యురిటీ గార్డు.. ఎలా సాధ్యమైందంటే?

తన జీతం పెరుగుదలకు సంబంధించిన గణాంకాలను వివరిస్తూ బికీ నంది ఇన్‌స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

By:  Tupaki Political Desk   |   3 May 2026 12:25 PM IST
ఐదేళ్లలో జీతం మూడు రేట్లు పెంచుకున్న  సెక్యురిటీ గార్డు.. ఎలా సాధ్యమైందంటే?
X

ఈ రోజుల్లో చిన్న జీతం అని నిరాశ చెందుతూ, ఖాళీగా ఉంటూ కాలం వృథా చేసే ఎంతో మంది యువతకు బికీ నంది జీవితం ఒక గొప్ప పాఠం. శ్రమను నమ్ముకుంటే విజయం తన కాళ్ల కాడికి వస్తుందని, ఒక సెక్యూరిటీ గార్డుగా ఉంటూనే తన ఎదుగుదలతో ఆయన నిరూపించారు. చాలా మంది ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ చేతిలో ఉన్న అవకాశాలను వదులుకుంటారు. కానీ, చెన్నైలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బికీ నంది మాత్రం అలా ఆలోచించలేదు. అతి తక్కువ జీతంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, నిలకడైన శ్రమతో నేడు గౌరవప్రదమైన వేతనాన్ని అందుకుంటున్నారు. ఆయన సాధించిన ఈ ఎదుగుదల సోషల్ మీడియాలో మిలియన్ల మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

బికీ నంది జీతాల ప్రయాణం (2021 - 2026)

ఒక సామాన్య సెక్యూరిటీ గార్డుగా జీవితం మొదలు పెట్టిన ఆయన జీతం పెరుగుతూ ఎంతకు చేరిందంటే..

2021: కేవలం రూ. 13,000 జీతంతో తన ఉద్యోగ ప్రయాణాన్ని ప్రారంభించారు.

2022: నిబద్ధతతో పనిచేయడంతో జీతం రూ. 15,000కు పెరిగింది.

2023: తర్వాతి ఏడాది రూ. 18,000 అందుకున్నారు.

2024: ఈ ఏడాది ఆయన జీతంలో గణనీయమైన పెరుగుదల కనిపించి రూ. 24,000కు చేరింది.

2025: గతేడాది రూ. 25,000 స్థాయికి చేరుకున్నారు.

2026: ప్రస్తుతం ఆయన రూ. 32,000 వేతనాన్ని అందుకుంటున్నారు.

3 మిలియన్ వ్యూస్

తన జీతం పెరుగుదలకు సంబంధించిన గణాంకాలను వివరిస్తూ బికీ నంది ఇన్‌స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఏకంగా 3 మిలియన్ల (30 లక్షల) వ్యూస్ రావడం విశేషం. ఏ ఉద్యోగమైనా చిన్నది కాదని, మన ప్రతిభను నిరూపించుకుంటే ఏ రంగంలోనైనా ఆదాయాన్ని పెంచుకోవచ్చని ఈ వీడియో సందేశాన్నిస్తోంది.

ఎక్కువ జీతం వస్తేనే పని చేస్తానంటూ ఇంట్లోనే ఉండి సమయాన్ని వృథా చేసే కొందరికి నంది జీవితం ఒక నిలువెత్తు సాక్ష్యం. ప్రారంభంలో జీతం తక్కువైనా, పని పట్ల అంకితభావం ఉంటే కాలక్రమేణా మంచి ఫలితాలు వస్తాయని ఆయన జీవతమే ఒక ఉదాహరణ. ఐదేళ్ల కాలంలో తన జీతాన్ని మూడు రెట్లు పెంచుకోవడం ఆయన పట్టుదలకు నిదర్శనం.

బికీ నంది కేవలం తన జీతాన్ని మాత్రమే పెంచుకోలేదు, తనపై తనకు ఉన్న నమ్మకాన్ని కూడా పెంచుకున్నారు. ఒక సెక్యూరిటీ గార్డుగా ఉంటూనే సమాజంలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. అవకాశాల కోసం ఎదురుచూడటం కంటే, ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎదగడం ఉత్తమమని ఆయన ప్రయాణం చెబుతోంది.