Begin typing your search above and press return to search.

నైతిక రాజకీయం.. అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీనా? ఏకగ్రీవమా?

దీంతో ఎక్కడా ఉప ఎన్నిక అనే మాట రాలేదు. కానీ, కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాత్రం ఇప్పుడు ఉప ఎన్నిక తప్పనిసరి అయింది

By:  Tupaki Desk   |   6 March 2024 6:08 AM GMT
నైతిక రాజకీయం.. అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీనా? ఏకగ్రీవమా?
X

అనుకోని విధంగా తెలంగాణలో ఉప ఎన్నిక వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ రెండేసి చోట్ల పోటీచేసిన నేపథ్యంలో ఎక్కడైనా ఒకచోట ఉప ఎన్నిక తప్పదనిపించింది. కానీ, తెలంగాణ ఓటర్లు తెలివిగా తీర్పు ఇచ్చారు. గజ్వేల్ లో కేసీఆర్ ను, రేవంత్ రెడ్డిని కొడంగల్ లో గెలిపించి కామారెడ్డిలో ఓడించారు. ఈటలను సొంత నియోజకవర్గం హుజూరాబాద్, గజ్వేల్ లోనూ ఓడించారు. దీంతో ఎక్కడా ఉప ఎన్నిక అనే మాట రాలేదు. కానీ, కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాత్రం ఇప్పుడు ఉప ఎన్నిక తప్పనిసరి అయింది.

అప్పుడు ఉప ఎన్నిక తప్పినా..

హైదరాబాద్ నగరంలోని కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న చనిపోయారు. అయినప్పటికీ ఉప ఎన్నిక నిర్వహించలేదు. దగ్గర్లోనే (నవంబరు) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో స్వల్ప వ్యవధికి ఉప ఎన్నిక జరపలేదు. అయితే, నిరుడు నవంబరులో జరిగిన సాధారణ ఎన్నికల్లో సాయన్న కుమార్తె లాస్య నందిత బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఫిబ్రవరి 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన మూడు నెలల్లోనే, ఎంతో గొప్ప భవిష్యత్ ఉన్న యువ నాయకురాలిని రోడ్డు ప్రమాదం కబళించడం విషాదం రేపింది. మరోవైపు లాస్య నందిత మరణంతో కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక తప్పని పరిస్థితి మొదలైంది.

లోక్ సభ ఎన్నికలతోనే..

కంటోన్మెంట్ ఉప ఎన్నికను లోక్ సభ ఎన్నికలతోనే నిర్వహించే అవకాశం ఉంది. ఈ వారంలో లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో దీనిపై స్పష్టత వస్తుంది. కాగా, కంటోన్మెంట్ లో లాస్య నందితపై ప్రజా యుద్ధ నౌక దివంగత గద్దర్ కుమార్తె వెన్నెల (కాంగ్రెస్) పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం పరిస్థితుల్లో కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను నిలుపుతాయా? అనేది చర్చనీయాంశం. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎవరైనా అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతే ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసే సంప్రదాయం తీసుకొచ్చారు.

బీఆర్ఎస్ అలా.. కాంగ్రెస్ ఎలా?

పాలేరులో 2016 లో ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి (కాంగ్రెస్) చనిపోతే నాడు బీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావును నిలిపారు. నారాయణఖేడ్ లో 2016లోనూ ఇలాగే జరిగింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంతో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారనేది చూడాలి. వాస్తవానికి రాజకీయంగా చూస్తే ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయడమే సరైనది. కానీ, బీఆర్ఎస్ దానిని విస్మరించింది. సాయన్న కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీకి దిగితే ఏకగ్రీవానికి సీఎం రేవంత్ అంగీకరించి పార్టీకి ప్రతిపాదిస్తే భిన్నమైన రాజకీయం చేసినట్లు అవుతుంది. రాజకీయాల్లో నైతికతను పాటించారన్న పేరు దక్కుతుంది.