సరోగసి... బిడ్డలు లేని దంపతులే బంగారు గుడ్డు పెట్టే బాతులు!
అది అక్కడితో అయిపోలేదు... సరోగసికి ఒప్పుకున్న మహిళకు రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని.. అదీ దంపతుల నుంచే వసూలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 28 July 2025 9:53 AM ISTసంతానం లేని దంపతులు ఇటీవల కాలంలో ఫెర్టిలిటీ కేంద్రాలను చూసి అవి తమకు వరాలని భావిస్తున్నారు! చాలా మంది నిజంగానే అక్కడ నుంచి వరాలు పొందారని చెబుతారు. అయితే.. తాజాగా సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఘటన తెరపైకి వచ్చిన తర్వాత.. అత్యంత దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లలను అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నారని చెబుతున్నారు.
అవును... ఐవీఎఫ్, సరోగసీతో పిల్లల్లేని కొరత తీర్చుతామంటూ.. శిశు విక్రయాలు సాగిస్తున్న సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు! పిల్లలు లేని దంపతులు వారి దగ్గరకు వస్తుంటే.. వైద్యపరీక్షలు నిర్వహించి ఐవీఎఫ్ వీలుపడదని, సరోగసీ ద్వారా బిడ్డను కనే అవకాశం ఉందని, రూ.25 నుంచి రూ.30 లక్షలు ఖర్చవుతుందని నమ్మిస్తున్నారు.
అది అక్కడితో అయిపోలేదు... సరోగసికి ఒప్పుకున్న మహిళకు రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని.. అదీ దంపతుల నుంచే వసూలు చేస్తున్నారు. ఆ సమయంలో గర్భంతో ఉన్న ఓ మహిళను చూపిస్తున్నారు. కట్ చేస్తే ఓ రోజు డెలివరీ అని చెప్పి.. నవజాతశిశువును దంపతుల చేతిలో పెడుతున్నారు. తీరా చూస్తే.. ఆ బిడ్డ వీరికి జన్మించింది కాదు!
అంటే... సంతానం లేని దంపతులకు వారి వీర్య, అండం ద్వారానే పిల్లలను పుట్టించి ఇస్తామని చెప్పి... దళారుల నుంచి శిశువులను కొనుగోలు చేసి సరోగసీ ద్వారా పుట్టినట్టు దంపతులకు అప్పగించేస్తున్నారన్నమాట. మరోవైపు అక్రమంగా సేకరించిన అండాలు, వీర్యకణాలను దేశంలోని వివిధ నగరాలకు చెందిన ఫెర్టిలిటీ కేంద్రాలకు చేరవేస్తున్నట్టు తేలింది.
ఈ క్రమంలో... అండం ఇచ్చిన మహిళకు రూ.20 వేల నుంచి 25 వేలు, వీర్యదానం చేసిన వ్యక్తికి రూ.800-1500 కమీషన్ ఇస్తున్నట్లు అధికారులు తాజా ఘటనలో గుర్తించారని తెలుస్తోంది. మరోవైపు తాజా ఘటనలో రాజస్థాన్ దంపతులకు ఇచ్చిన బిడ్డను అస్సాంలోని మహ్మద్ అలీ, నస్రీన్ బేగం దంపతుల నుంచి రూ.90 వేలకు కొన్నట్లు చెబుతున్నారు.
ఇలా వందలు, వేలు పెట్టుబడి పెట్టి.. లక్షలు, కోట్లు సంపాదిస్తున్నాయి ఈ ఫెర్టిలిటీ సెంట్ర్లు అని చెబుతున్నారు! ఇక్కడ సేకరించిన వీర్యం, అండాలను అహ్మదాబాద్ కు పంపుతున్నారని ఈ సెంటర్ లో పని చేస్తున్న స్టాఫ్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో... పలు బృందాలను అహ్మదాబాద్ పంపి లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారని సమాచారం.
కఠిన చర్యలు తీసుకోవాలి - మంత్రి దమోదర్ రాజనర్సింహం!:
'సృష్టి ఫెర్టిలిటీ సెంటర్' వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేసి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన.. ఇలాంటి కేంద్రాలపై తనిఖీలు ముమ్మరం చేయాలని అన్నారు.
