హనీమూన్ కు వెళుతున్న వేళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విషాదం
పెళ్లై.. హ్యాపీగా హనీమూన్ ట్రిప్ కు ప్లాన్ చేసుకున్న నవ దంపతులు ఊహించని విషాదం ఎదురైంది. దీనికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వేదికైంది.
By: Tupaki Desk | 7 Jun 2025 12:00 PM ISTపెళ్లై.. హ్యాపీగా హనీమూన్ ట్రిప్ కు ప్లాన్ చేసుకున్న నవ దంపతులు ఊహించని విషాదం ఎదురైంది. దీనికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వేదికైంది. వరంగల్ పట్టణానికి చెందిన 28 ఏళ్ల సాయి స్థానికంగా గిఫ్ట్ ఆర్టికల్స్ తయారీ సంస్థలో వర్కర్ గా పని చేస్తుంటాడు. అతడికి మూడు నెలల క్రితం పెళ్లైంది. హనీమూన్ కు గోవా వెళ్లాలని భావించారు. ఇందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నారు.
ముందుగా నిర్ణయించుకున్నట్లే.. శుక్రవారం ఉదయం భార్య.. బావమరిది.. నలుగురు స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. తొమ్మిదో నంబరు ప్లాట్ ఫాం మీద ఉన్న వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కారు. రైలు బయలుదేరటానికి ఆలస్యం కావటంతో ప్లాట్ ఫాం మీద ఉన్న స్టాల్ లో వాటర్ బాటిల్ కొనేందుకు సాయి రైలు దిగాడు. అంతలోనే రైలు బయలుదేరటంతో బోగీలో ఉన్న అతడి స్నేహితులు చైన్ లాగారు.
దీంతో రైలు ఆగటం.. చైన్ లాగిన ప్రాంతానికి ఆర్పీఎఫ్ పోలీసులు వెళ్లగా.. జరిగిన విషయాన్ని పోలీసులకు సాయి స్నేహితులు చెప్పారు. చైను లాగిన సాయి స్నేహితులు ఇద్దరిని పోలీసులు ప్లాట్ ఫాం మీదకు తీసుకొచ్చారు. అప్పుడే రైలు ఎక్కిన సాయి విషయం తెలుసుకొని తిరిగి కిందకు వచ్చాడు. అక్కడున్న పోలీసులకు ఫైన్ చెల్లిస్తామని.. రైలు వెళ్లిపోతుందని.. తమను వదిలిపెట్టాలని ప్రాధేయపడుతున్న వేళలోనే రైలు బయలుదేరింది,
ట్రైన్ లో భార్య.. బావమరిది.. ఇతర స్నేహితులు ఉండటంతో.. వేగంగా వెళుతున్న రైలులోకి ఎక్కే ప్రయత్నం చేశాడు సాయి. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి రైలు.. ప్లాట్ ఫాం మధ్యన పడిపోవటంతో తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. డెడ్ బాడీని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు పోలీసులు. సరదాగా హనీమూన్ ఎంజాయ్ చేద్దామనుకున్న వేళ.. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ విషాదం పలువురికి కళ్ల వెంట నీళ్లు తెప్పించింది.
