Begin typing your search above and press return to search.

ఎకలాన్.. ప్రపంచాన్ని శాసించేందుకు 5దేశాల సీక్రెట్ సంస్థ!

ఈ ప్రాజెక్టు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఐదు ఇంగ్లిషు దేశాలు నడుపుతున్న సీక్రెట్ సైబర్ పోలీసింగ్ గా చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 4:37 AM GMT
ఎకలాన్.. ప్రపంచాన్ని శాసించేందుకు 5దేశాల సీక్రెట్ సంస్థ!
X

ప్రాజెక్టు ఎకలాన్. ఇదేమీ హాలీవుడ్ సినిమా కాదు. ఫిక్షన్ అంతకన్నా కాదు. ఇది నిజం. పచ్చి వాస్తవం. ప్రపంచ మీద అధిక్యత కోసం.. ప్రపంచ దేశాల్లో ఏమూలన ఏం జరిగినా.. తమకు సమాచారాన్ని అందించేందుకు వీలుగా ఐదు ఆంగ్లేయ దేశాలు షురూ చేసిన సీక్రెట్ సైబర్ పోలీసింగ్.

సొంత దేశాల్లోని కంపెనీలు.. ప్రముఖుల మీద మొదలుకొని ప్రపంచ దేశాల్లోని పవర్ ఫుల్ వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించటం.. దాన్ని విశ్లేషించి.. తమ ప్రయోజనాల్ని కాపాడుకోవటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. దాని పేరే.. ఎకలాన్.

ఈ ప్రాజెక్టు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఐదు ఇంగ్లిషు దేశాలు నడుపుతున్న సీక్రెట్ సైబర్ పోలీసింగ్ గా చెప్పొచ్చు. ఇంతకూ ఆ ఐదు దేశాలేమిటన్నది చూస్తే..

- అమెరికా

- ఆస్ట్రేలియా

- కెనడా

- న్యూజిలాండ్

- యూకే

ఎకలాన్ ను రహస్య కోడ్ గా కొందరు అభివర్ణిస్తే.. మరికొందరు ఇదో సిగ్నల్ ఇంటెలిజెన్స్ అనాలసిస్ ప్రాజెక్టుగా పేర్కొంటారు. ఐదు దేశాలు కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టును కొందరు.. ''ఫైవ్ ఐస్'' అదేనండి.. 5 కళ్లుగా పేర్కొంటారు. ఈ ప్రాజెక్టును 1947లోనే షురూ చేశామని.. ఐదు దేశాలు ప్రపంచ వ్యాప్తంగా తమ నిఘాను విస్తరించి.. ఎక్కడేం జరుగుతున్నా.. వాటి వివరాల్ని సేకరించటమే పనిగా చెబుతారు. 1975కుముందు దీన్ని షామ్ రాక్ అనే కోడ్ పేరుతో పిలిచేవారిన చెబుతారు.

అత్యాధునిక సాంకేతికత పెరిగిన తర్వాత ఈ ఎకలాన్ భారీగా విస్తరించి.. పరిశ్రమలు.. ప్రముఖుల మీద పెట్టారు. అమెరికాలోని మేరీలాండ్ కేంద్రంగా దీని కార్యకలాపాలు సాగిస్తున్నా.. దీని హెడ్డాఫీసు మాత్రం బ్రిటన్ లోనే ఉందని చెబుతారు. ఇప్పటివరకు జనస్వామ్యంలోకి రాని ఈ పేరు ఇప్పుడెందుకు వచ్చిందంటే.. ఈ మధ్య భారత - కెనడా మధ్య దౌత్య ఘర్షణకు ప్రాజెక్టు ఎకలాన్ అందించిన సమాచారమే కారణమని చెబుతున్నారు.

మొయిల్.. వాట్సాప్.. సిగ్నల్.. మాధ్యమం ఏదైనా సరే.. పరికరం మరేదైనా సరే.. ప్రతి మాటా నిఘా నీడన ఉండేలా.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా.. దానికి సంబంధించిన సమాచారం తమకు తెలిసేలా చేసుకోవటమే ప్రాజెక్టు ఎకలాన్ ప్రత్యేకగా చెప్పొచ్చు. ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై భారత్ పాత్ర బలంగా ఉందన్న సాక్ష్యాలు ఉన్నట్లుగా కెనడా పదే పదే చెప్పటం వెనుక ప్రాజెక్టు ఎకలాన్ ఉందన్న మాట వినిపిస్తోంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఎలక్ట్రానిక్.. డిజిటల్ రూపంలో ప్రపంచ వ్యాప్తంగా వెళ్లే ఏ సందేశాన్ని అయినప్పటికీ.. ఎలాంటి లావాదేవీ అయినప్పటికీ అత్యాధునిక సూపర్ కంప్యూటర్ల ద్వారా ఆ సమాచారాన్ని ఒడిసి పడతారు. ఎకలాన్ నిఘంటువులోని కీలక పదాల సాయంతో ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే దొంగతనంగా ఒకరి సమాచారాన్ని వినటం ఎలానో.. ప్రాజెక్టు ఎకలాన్ పాత్ర కూడా అలాంటిదే. ప్రపంచ దేశాలకు సంబంధించిన సమాచారాన్ని దొంగతనంగా వినటమే వారి లక్ష్యం.

అనేక దేశాలకు సంబంధించిన సమాచారాన్ని అమెరికా దొంగచాటుగా వింటుందన్న విషయాన్ని గతంలో బయటపెట్టి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాడు ఎడ్వర్డ్ స్నోడెన్. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్రెజిల్.. జర్మనీ..భారత్.. జపాన్.. థాయిలాండ్ లో.. అమెరికా ఎకలాన్ నిఘా వ్యవస్థను నడుపుతున్నట్లుగా చెబుతారు. ఎకలాన్ అందించే సమాచారంతోనే ప్రపంచ వ్యాప్తంగా తన నిఘా నేత్రాన్ని విస్తరించి.. ఎక్కడేం జరిగినా.. ఏం జరగాలన్న తానే కర్త.. కర్మ.. క్రియ అన్నట్లుగా మారినట్లుగా చెబుతారు.

చివరకు ఈప్రాజెక్టు మీద యూరోపియన్ పార్లమెంటు సైతం ఆందోళన వ్యక్తం చేయటం చూస్తే.. దీని పరిధి ఎంత ఎక్కువన్నది ఇట్టే అర్థమవుతుంది. కమ్యూనికేషన్ వ్యవస్థల్లో సాయం చేస్తున్నట్లుగా పైకి చెబుతూ.. ఆయా దేశాల గుట్టుమట్లన్నీ దొంగచాటుగా తెలుసుకునేలా చేసే ఏర్పాటు ప్రాజెక్టు ఎకలాన్ లో భాగంగా చెబుతున్నారు.