విన్నంతనే కంటతడి.. మతం పేరుతో ఒకే అంబులెన్సులో వద్దట!
భర్త ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన 20 నిమిషాల్లోనే 17వ అంతస్తులోకి వెళ్లి.. అక్కడి నుంచి దూకేసి ప్రాణాలు తీసుకుంది షాజియా సిరాజ్.
By: Garuda Media | 3 April 2026 9:57 AM ISTమతం..మనిషికి మించిందా? మనిషి ముందు పుట్టి.. ఆ తర్వాతే మతం పుట్టిందన్న విషయాన్ని ఈ డిజిటల్ యుగంలోనూ అర్థం చేసుకోకపోవటం దేనికి నిదర్శనం? రోజులు గడుస్తున్న కొద్దీ.. మతాలు.. కులాల పట్టింపులు అంతకంతకూ పెరిగిపోవటం చూస్తే.. ఇదేనా మనం సాధించిన నాగరికత? అన్న సందేహం కలుగకమానదు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బెంగళూరులో తెలంగాణకు చెందిన ఇద్దరు టెకీలు ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. సుదీర్ఘకాలం లివింగ్ రిలేషన్ లో ఉండి.. మతాలు వేర్వేరు కావటంతో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకొని.. ఎవరికి చెప్పకుండా రహస్యంగా బతికిన వైనం ఒక ఎత్తు అయితే.. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోయి.. తీవ్రమైన డిప్రెషన్ లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకోవటం మరో ఎత్తు,
తెలంగాణకు చెందిన భానుచందర్ రెడ్డి.. షాజియా సిరాజ్ లు చిన్నతనం నుంచి క్లాస్ మేట్స్ కావటం.. ఇరువురు తమ ప్రేమను తమతో పెంచుకోవటం.. మతాలు వేరు కావటంతో ఎవరికి తెలీకుండా రహస్యంగా భార్యభర్తలుగా ఉండటం తెలిసిందే. విదేశాల్లో ఉండి.. ఉద్యోగం పోయిన తర్వాత స్వదేశానికి వచ్చి.. భార్య షాజియాకు ఐబీఎంలో జాబ్ రావటంతో వారు బెంగళూరుకు షిప్ట్ అయ్యారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోవటంతో భానుచందర్ రెడ్డి డిప్రెషన్ లోకి వెళ్లిపోయి.. తాజాగా ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే.
భర్త ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన 20 నిమిషాల్లోనే 17వ అంతస్తులోకి వెళ్లి.. అక్కడి నుంచి దూకేసి ప్రాణాలు తీసుకుంది షాజియా సిరాజ్. ఇక్కడి వరకు అందరికి తెలిసిన కథే. ఇక్కడే గుండెలు పిండేసే ఉదంతం వెలుగు చూసింది. ఈ జంట విషాద ఉదంతం తర్వాత పోలీసులు వీరి డెడ్ బాడీస్ ను పోస్ట్ మార్టంకు తరలించారు. అక్కడి నుంచి అంత్యక్రియల కోసం ఇద్దరి డెడ్ బాడీలను ఒకే అంబులెన్సులో తీసుకెళుతున్న వేళ.. బంధువులు అడ్డు చెప్పటం చూస్తే.. మనసుకు కష్టం కలుగుతుంది.
మతాలు వేర్వేరు అయినప్పుడు వేర్వేరు అంబులెన్సులో తీసుకెళ్లాలన్న బంధువుల మాటకు.. పలువురు అడ్డుపడి బతికి ఉన్నప్పుడు ఇద్దరు ఎలాగూ స్వేచ్ఛగా కలిసి ఉండలేకపోయారు. కనీసం చావులో అయినా వారిని కలిసి వెళ్లనివ్వండి అంటూ చెప్పి ఒప్పించారు. మతం మనిషిలోని మానవత్వాన్ని ఎలా మాయం చేస్తుందన్న దానికి ఇదో ఉదాహరణగా చెప్పాలి. అదే సమయంలో ఐటీ రంగంలోకి దూసుకొచ్చిన ఏఐ ఎలాంటి సవాళ్లను విసురుతుందన్న దానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ. ఏమైనా.. మానసిక కుంగుబాటు.. కుల మతాల పట్టింపులు మనుషుల ప్రాణాల్ని బలి తీసుకోవటం ఈ జంట దీనగాథ ఒక ఎగ్జాంఫుల్ గా చెప్పక తప్పదు.
