వైట్ హౌస్ మాదిరి.. రాష్ట్రపతి భవన్లో కూడా సీక్రెట్ బంకర్ ఉందా ?
అయితే, భారత రాష్ట్రపతి భవన్‌లో ఏదైనా రహస్య బంకర్ నిర్మించబడిందా లేదా అనే విషయంపై అధికారికంగా తెలియదు.
By: Tupaki Desk | 2 May 2025 2:30 AMఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికాలోని వైట్ హౌస్ మాదిరి భారత రాష్ట్రపతి భవన్లో కూడా ఏదైనా రహస్య బంకర్ ఉందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంది. భారతదేశంలో రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు మాత్రమే కాదు.. మూడు సైనిక దళాలకు సర్వ సైన్యాధ్యక్షుడు కూడా. రాష్ట్రపతి నివసించే భవనాన్ని రాష్ట్రపతి భవన్ అని పిలుస్తారు. ఈ భవనం భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది.
అయితే, భారత రాష్ట్రపతి భవన్‌లో ఏదైనా రహస్య బంకర్ నిర్మించబడిందా లేదా అనే విషయంపై అధికారికంగా తెలియదు. భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రపతి, రాష్ట్రపతి భవన్ గురించిన అనేక కీలక సమాచారాన్ని బహిరంగంగా అందుబాటులో ఉంచరు. కొన్ని వివరాలు అత్యంత రహస్యంగా ఉంటాయి.
భారతదేశంలో రాష్ట్రపతి భద్రతను రాష్ట్రపతి వారి అంగరక్షకులు చూసుకుంటారు. ఇది భారతదేశంలోని పురాతన, అత్యంత సీనియర్ గుర్రపు దళ రెజిమెంట్(Cavalry Regiment), ఇది ఎల్లప్పుడూ రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి భద్రత కోసం రెడీగా ఉంటుంది. రాష్ట్రపతి భవన్ భద్రతలో ఢిల్లీ పోలీసులు, ప్రత్యేక భద్రతా బృందం (SPG), ఇతర నిఘా సంస్థలు కూడా పాల్గొంటాయి.
మరోవైపు అమెరికాలో అధ్యక్షుడి భద్రత కోసం అత్యంత రహస్యమైన, సురక్షితమైన బంకర్లను నిర్మించారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడిని సురక్షితంగా ఉంచడమే వీటి ప్రధాన లక్ష్యం. ఈ బంకర్లు అణు, జీవ లేదా ఉగ్రవాద దాడుల సమయంలో అధ్యక్షుడిని రక్షించడానికి ఉపయోగంగా ఉంటాయి. అనేక మీడియా నివేదికల ప్రకారం.. జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత జరిగిన నిరసనల సమయంలో ట్రంప్ తన పదవీకాలంలో ఈ బంకర్‌ను ఉపయోగించారు.