11ఏ మిస్టరీ: ఒకే సీటు.. 27 ఏళ్లు.. రెండు ప్రాణాలు!
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 Jun 2025 3:09 PM ISTఅహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే నేలను తాకి అగ్ని గోళం ఏర్పడింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డారు. అతడే బ్రిటీష్ పౌరుడైన విశ్వాస్ కుమార్. ఆ ఎయిరిండియా విమానంలో అతడు కూర్చున్న సీట్ నెంబర్ 11ఏ. అయితే 27 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటన జరిగింది.
అవును... అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా విమానంలో ఆయన కూర్చున్న నంబర్ 11ఏ సీటు అత్యవసర ద్వారాల్లో ఒకదానికి దగ్గర్లో ఉండటం వల్ల.. ప్రమాదం నుంచి బయటపడటానికి దోహదపడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ సీటు గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.
ఈ క్రమంలోనే సుమారు 27 ఏళ్ల క్రితం జరిగిన ఓ విమాన ప్రమాదంలోనూ 11ఏ సీటులో కూర్చున్న 20 ఏళ్ల వ్యక్తి సురక్షితంగా బయటపడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 11ఏ సీటులో కూర్చున్న వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయట పడిన వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారిన వేళ.. థాయ్ నటుడు, గాయకుడు రువాంగ్ సక్ లాయ్ చూజాక్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.
ఇందులో భాగంగా... డిసెంబర్ 11 - 1998న అంటే సుమారు 27 ఏళ్ల క్రితం థాయ్ ఎయిర్ వేస్ విమానం.. దక్షిణ థాయిలాండ్ లో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూలిపోయింది. ఈ ఘటనలో అందులో ఉన్న 146 మంది ప్రయాణికుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారని.. 45 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని.. వారిలో 11ఏ సీటులో కూర్చున్న తాను మాత్రం ఎలాంటి తీవ్ర గాయాలు లేకుండా తప్పించుకున్నట్లు తెలిపారు.
దాదాపు అలాంటి ఘటన తాజాగా భారత్ లో మళ్లీ జరిగేసరికి తాను షాక్ అయ్యాయని ప్రస్తుతం 48 ఏళ్ల వయసులో ఉన్న రువాంగ్ తెలిపారు. ఆ ప్రమాదం జరిగిన సుమారు పదేళ్ల పాటు తాను విమానంలో ప్రయాణించలేదని.. నాడు జరిగిన ఆ విమాన ప్రమాదం తనకు పునర్జన్మ అని తెలిపారు. ఆ షాక్ నుంచి బయటకు రావడానికి చాలా రోజులు పట్టిందని అన్నారు.
కాగా... గురువారం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రయాణంలోనూ 11ఏ సీటులో కూర్చొన్న విశ్వాస్ కుమార్... తన సీటు బెల్ట్ ఊడిపోయి, ఎగిరి బయట పడ్డానని.. విమానం హాస్టల్ భవనాన్ని ఢీకొన్నప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఊడిపోయి ఉండొచ్చని.. దాని నుంచి తాను ఎగిరి బయట పడ్డానని వెల్లడించిన సంగతి తెలిసిందే. విమానం ముక్కలైనప్పుడు తన సీటుతో సహా బయటకు విసిరివేయబడ్డానని వెల్లడించారు!
ఇలా 11ఏ సీటు విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో.. ఇకపై 11ఏ సీటుకి విమాన టిక్కెట్స్ బుక్కింగ్స్ లో ఫుల్ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని.. టిక్కెట్ బుక్కింగ్స్ లో చాలా మందికి ఇప్పుడు ఇదే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయ్యే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
