వైసీపీలో సీల్డ్ కవర్లు రెడీ అయ్యాయా ?
చివరిసారిగా వర్క్ షాపు నిర్వహించినపుడు 18 మంది ఎంఎల్ఏల పనితీరుపై జగన్ చాలా అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 21 Sep 2023 5:50 AM GMTసీల్డ్ కవర్లంటే ఇంకేమిటో అనుకునేరు. మంత్రులు, ఎంఎల్ఏల తలరాతలను జగన్మోహన్ రెడ్డి రెడీచేసి వాటిని సీల్డ్ కవర్లలో పెట్టారట. అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ కవర్లను అందరికీ ఇవ్వబోతున్నారని పార్టీవర్గాల సమాచారం. గడచిన నాలుగున్నరేళ్ళుగా నియోజకవర్గాల్లో ఎంఎల్ఏల పనితీరుపై జగన్ అనేక విధాలుగా సర్వేలు చేయించుకున్నారు. ఒకటి రెండు మార్గాల్లో కాదు కనీసం ఐదారు విధాలుగా సర్వేలు చేయించుకుని రిపోర్టును తయారుచేయించారు. అంటే నెలరోజుల క్రితం మదింపుచేసిన సర్వే రిపోర్టు లేటెస్టని పార్టీవర్గాలు చెప్పాయి.
అలా తయారుచేసిన రిపోర్టులను నియోజకవర్గాల వారీగా రెడీ చేశారట. ఈ రిపోర్టు కాపీలను మొత్తాన్ని దేనికదే విడివిడిగా కవర్లలో పెట్టి సీల్ వేశారట. ఆ సీల్డ్ కవర్లనే జగన్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతి ఎంఎల్ఏకి వ్యక్తిగతంగా అందించబోతున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు వర్క్ షాపులను పెట్టడం అందులో ఎంఎల్ఏల పనితీరును చదివి వినిపించేవారు. అవసరమైన ఎంఎల్ఏలను విడిగా పిలిపించుకుని క్లాసులు పీకేవారు. దాంతో కొందరు ఎంఎల్ఏల పనితీరు మెరుగుపరుచుకున్నారు. మరికొందరు ఎంఎల్ఏల పనితీరు ఏమాత్రం మెరుగుపడలేదు.
చివరిసారిగా వర్క్ షాపు నిర్వహించినపుడు 18 మంది ఎంఎల్ఏల పనితీరుపై జగన్ చాలా అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. రోజుకు ముగ్గురు, నలుగురు ఎంఎల్ఏలను పిలిపించుకుని ఫుల్లుగా క్లాసులు పీకారు.
అయితే అదంతా చరిత్రగా మిగిలిపోయింది. ఇపుడు తాజా పద్దతి ఏమింటే సీల్డ్ కవర్లే. రిపోర్టులోని అంశాలను ప్రస్తుత తమ పరిస్ధితికి భేరీజు వేసుకుని తనను వచ్చి కలవమని జగన్ చెప్పబోతున్నారట.
ఈ పద్దతిలో తమకు తాము రేటింగ్ ఇచ్చుకునేందుకు జగన్ అందరికీ అవకాశం ఇచ్చినట్లుగా పార్టీవర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల సుమారు 30 మంది ఎంఎల్ఏలకు టికెట్లు దక్కే అవకాశాలు లేవని పార్టీలో ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది. మరి ఆ ప్రచారం నిజమవుతుందా లేకపోతే జగన్ పెట్టుకున్న పరిమితుల్లో కొందరు ఎంఎల్ఏలు సరిపోతారా అన్నదే ఇపుడు సస్పెన్సుగా మారింది. ఏదేమైనా కొందరు ఎంఎల్ఏలకు మాత్రం టికెట్లు రావన్నది స్పష్టం. కాకపోతే ఎంతమందికి అన్నదే అనుమానం.