రేవంత్ సర్కారుకు మంద కృష్ణ సెగ.. ఎస్సీ వర్గీకరణ బాలేదట!
ఇంతలోనే మీడియా ముందుకు వచ్చిన మందకృష్ణ మాదిగ.. ఎస్సీ వర్గీకరణలో చాలా వరకు తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు.
By: Tupaki Desk | 5 Feb 2025 9:25 AM GMTతెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా.. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను చేపట్టి ముగించిన విషయం తెలిసిందే. మొత్తం ఎస్సీలను ఏ,బీ,సీలుగా వర్గీకరించారు. దీనిని మళ్లీ సబ్ కేటగిరీగా కూడా వర్గీకరించారు. దీనిపై అధికార పక్షం ఆనందం వ్యక్తం చేసింది. ఇక, రాజకీయ వైరాలు ఎలా ఉన్నప్పటికీ.. ఎస్సీ వర్గీకరణపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ కూడా ఫర్వాలేదని మార్కులు వేసేసింది.
అయితే.. ఇంతలోనే మీడియా ముందుకు వచ్చిన మందకృష్ణ మాదిగ.. ఎస్సీ వర్గీకరణలో చాలా వరకు తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్న కులాలను కూడా ఈ జాబితాలో చేర్చేశా రని చెప్పారు. కంబాల అనే కులం ప్రస్తుతం అడ్వాన్స్‌గా ఉందని.. ఈ కులానికి చెందిన వారు.. ఆస్తులు, ఉద్యోగాల పరంగా అగ్రస్థానంలో ఉన్నారని.. కానీ, వీరిని కూడా రిజర్వేషన్ కేటగిరిలో చేర్చారని తప్పుబ ట్టారు. కంబాల ప్రజలు 1000 మంది ఉంటే.. 100 మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారన్నారు.
అదే విధంగా ఒకటి రెండు శాతం ఉన్న జనాభాను కూడా `ఏ` కేటగిరిలో చేర్చారని, దీనివల్ల నిజమైన ఎస్సీ వర్గానికి మేలు జరగదని తెలిపారు. దీనిపై సర్కారు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని తాము మరోసారి సర్కారుకు వివరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలోని తప్పులు భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తాయని ఆయన పేర్కొన్నారు. కాబట్టి.. ఈ నివేదికను సరిదిద్దాల్సిన అవసరం ఉందని మంద కృష్ణ వ్యాఖ్యానించారు.